సనాతన ధర్మ సంస్కృతుల రక్షణకై చేసే సంకల్పమే రక్షాబంధన్


ప్రపంచంలో భారతీయ సంస్కృతికి ఒక విశిష్ట స్థానమున్నది. భారతీయ సంస్కృతికి ఆధారం ధర్మాచరణ. ధర్మము అనే పదానికి మన హిందూ సమాజంలో ఒక విశేషత ఉన్నది. అందుకే ఈ దేశంలో "ధర్మో రక్షతి రక్షితః" అంటారు. ధర్మాన్ని ఎవరు రక్షిస్తూ ఉంటారో వారిని ధర్మం రక్షిస్తుందని భావం. ధర్మం ఎప్పుడు అస్థిరమవుతుందో అప్పుడు సమాజ జీవనంలో పతనం ప్రారంభమవుతుంది. అందుకే ధర్మాన్ని కాపాడటం మనందరి కర్తవ్యం. సనాతనమైన మన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలకు నష్టం వాటిల్లినప్పుడు పరస్పరము రక్షకులమై మన సంస్కృతి సాంప్రదాయాలను రక్షించుకోవాలని తెలిపేదే రక్షాబంధన్.

నిత్య జీవితంలో ఎవరికి వారు మన మన వ్యవహారాలలో, సంసారాలలో చిక్కుకొని నడుస్తున్నప్పుడు మన ధర్మ రక్షణ ఆశయము విస్మరణ జరగకుండా, ఏ విద్యావిజ్ఞానాల మీద మన ధర్మం సంస్కృతి సాంప్రదాయాలు ఆధారపడి ఉన్నాయో వాటిని గుర్తు చేసేది, వాటిని మననం చేయాలని స్ఫురింపచేసేది శ్రావణ పూర్ణిమ. ఈ శ్రావణ పూర్ణిమ విద్యాధ్యయనమునకు ప్రారంభ దినంగా పాటించబడుతూ ఉండేది. సన్యాసులు మూడు రాత్రులు ఒకచోట నిద్ర పోరాదు అనే ఒక నియమం ఉంది. అంటే నిరంతరం తిరుగుతూనే ఉండాలి. ఆ నియమానికి ఒక్క ఆషాఢ పౌర్ణమి నుండి నాలుగు మాసాలు మినహాయింపు ఉంది. ఆషాఢ పౌర్ణమి నుండి చాతుర్మాస్య దీక్ష ప్రారంభమవుతుంది. ఈ నాలుగు మాసాలు కదలకుండా ఒకే స్థలంలో ఉంటూ ప్రజలకు ధర్మ ప్రబోధం చేస్తూ ఉండాలి. అటువంటి బాధ్యత సాధుసంతులకు ఉంది. సమాజంలో ధర్మం, సంస్కృతి గురించి ప్రజలకు అవగాహన కలిగించటం ఎంత ముఖ్యమో ఆ ధర్మ సంస్కృతులను నిత్య జీవితంలో ఆచరించటం, వాటిని కాపాడుకొనేందుకు కృషి చేయటం కూడా అంతే ప్రాముఖ్యత కలిగిన అంశం. మహాభారత గాధ చదువుతున్నప్పుడు ధర్మం కోసం పాండవులు పడినపాట్లు మన హృదయాలను కదిలిస్తాయి. భగవాన్ శ్రీకృష్ణుడు "ఇదం న మమ" అనే భావంతో వ్యవహరించిన కర్మమయ జీవనం ఏ కాలానికైనా ఆదర్శం. ధర్మ సంరక్షణకు శ్రీకృష్ణుడు చేసిన ప్రయత్నాలు ఎంతో ప్రేరణదాయకం.

ధర్మరక్షణలోనే సమాజ రక్షణ, పరస్పర రక్షణ ఉన్నది. ధర్మ సంరక్షణకు ఇంద్రుని భార్య శచీదేవి ఇంద్రుడికి రక్ష కట్టి ఈ రక్ష సాక్షిగా మీరు విజయం సాధిస్తారని చెప్పింది. ఆ స్ఫూర్తే మనకు రక్షాబంధనం ఇచ్చే సందేశం. రక్షాబంధన్ నేటికీ సమస్త భారతంలో ఏదో రూపంలో మనకు కనబడుతుంది. మన దేశంలో ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా ఒక సంకల్పం చెప్పుకొంటాం. ఈ సంకల్పానికి చిహ్నంగా కట్టే మామిడి తోరణమే రక్ష. మన దేశం మీద విదేశీయుల దురాక్రమణ జరుగుతున్న సమయంలో పరస్పరం సంరక్షించుకొని సమాజ సంరక్షణకు చేసిన ప్రేరణ కలిగించే అనేక సంఘటనలు కనబడతాయి. చత్రసాల్ బుందేల్ ఖండ్ కు రాజు. మొగలులతో పోరాటంలో తన శక్తి సరిపోకపోతే బాజీరావు పీష్వాకు సందేశంగా రక్ష కట్టి పంపించాడు. బాజీరావు చత్రసాల్ కు రక్ష పంపి సహకరించాడు. ఈ విధంగా దేశ ధర్మ సంరక్షణకు కృషి చేశారు.  

ఈ రోజున ప్రపంచంలో మార్పు కోసం భారత్ భారత్ గా నిలబడాలి. భారత్ భారత్ గా నిలబడాలంటే హిందువు హిందువుగా నిలబడాలి. హిందువు హిందువుగా నిలబడాలంటే హిందుత్వం గురించి అవగాహన కావాలి. హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను అర్థం చేసుకొని సమర్థవంతంగా తిప్పికొట్టగలగాలి. ఈ దేశంలోని పాలకులకు హిందుత్వ అవగాహన ఉండాలి. హిందూ సమాజ సంరక్షణకు నిలబడాలి. అందుకే హిందుత్వ భావాలు పుణికిపుచ్చుకొన్న వ్యక్తి ఈ దేశ ప్రధాని కావాలి. ఈ దేశంలో హిందువు తనను తాను హిందువుగా గుర్తించుకోని  కారణంగా కాశ్మీర్ రావణ కాష్టంలా ఉంది. పాలకులు తమ అధికారాన్ని పదిలపరచుకొనేందుకు అవసరమైన విధానాలను అమలు చేస్తూ సమస్యలను మరింత జటిలం చేస్తున్నారు. 

మరోప్రక్క పాకిస్తాన్ కంటే ప్రమాదకరంగా బంగ్లాదేశ్ అవతరించింది. అక్కడి హిందువుల జీవన పరిస్థితులను దుర్భరం చేయటం, హిందువులను మహమ్మదీయులుగా మతం మార్చటం విశృంఖలంగా సాగిపోతున్నది. ఇంకొక ప్రక్క బంగ్లాదేశ్ తన చిరకాల వాంఛ అయిన ఈశాన్య రాష్ట్రాలను ఇస్లాంమయం చేసేందుకు అక్రమ వలసలు ప్రోత్సహిస్తూ అనేక సమస్యలు సృష్టిస్తున్నది. ఆ సమస్యల దుష్ఫలితాలు ఈ రోజున చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అస్సాం హిందువు, కాశ్మీరీ హిందువు, దేశంలో మరో ప్రాంతంలో ఉన్న హిందువు - ఇలా మనందరం హిందువులం. మనలో మనకు గల పరస్పర సంబంధం, ఐక్యతే ఈ దేశాన్ని, హిందూ సమాజాన్ని కాపాడుతుంది. అదే మనకు శ్రీరామరక్ష అనే భావం పటిష్టం కావాలి. దానికోసం కృషి చేయవలసిన అవసరం ఉన్నది. ఆర్ధిక సరళీకరణ పేరుతొ విశృంఖల ఆర్ధిక విధానాలు ప్రజలను అనేక సమస్యలలోనికి నెడుతున్నది. దేశంలో అవినీతి ఎంతగా పెరిగిపోయిందంటే అవినీతే ఈ రోజున ఈ దేశాన్ని పాలిస్తున్నది. ఈ సంకట పరిస్థితుల నుండి మనలను మనం కాపాడుకొంటూ సమాజాన్ని కాపాడుకోవటం మనందరి కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని గుర్తు చేస్తుకొంటూ మనం పరస్పరం రక్ష కట్టుకోవాలి. ఈ దిశలో ఈ దేశంలో పని చేస్తున్న అన్ని ధార్మిక శక్తులను కలిపి ఈ సమాజాన్ని శక్తివంతం చేసేందుకు కృషి చేయాలి. 

రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఈ పనిని వేగవంతంగా చేసుకొంటూ ముందుకు పోతున్నది. ఈ రోజున ఈ దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులలో "మనం" అనే భావనను నిర్మాణం చేస్తూ మన ధర్మం, సంస్కృతిని కాపాడుకొనేందుకు కృషి చేసేందుకు పని చేస్తున్నది. హిందూ సమాజంలో భేద భావనలు దూరం చేసి పరస్పర సోదర భావంతో కలిసి ఉండేందుకు, ఉండగలుగుతాము, అద్భుతాలు సాధించగలుగుతాము అని అనేక ఉదాహరణలు సంఘం ఈ రోజున సమాజం ముందు ఉంచుతున్నది. ఈ రోజున దేశ ప్రజలలో సంఘం యెడల శ్రద్ధ, విశ్వాసం నిర్మాణమవుతున్నాయి. ఈ పనిని ముందుకు తీసుకొని వెళ్లేందుకు మనందరం కృషి చేయాలి. ధర్మ దోష శక్తుల కుయుక్తులను వమ్ము చేయాలి. ఈ దేశ ప్రజలలో భేదభావాలు నిర్మాణం చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్న అన్ని శక్తుల కుతంత్రాలను విఫలం చేయాలి. హిందూ సమాజం ఒకే కుటుంబంగా లేచి నిలబడి వసుధైవ కుటుంబ భావనను పటిష్టం చేసి ప్రపంచంలో శాంతిని సాధించాలి. ఆ లక్ష్యమే పరమేశ్వరుడు హిందూ సమాజానికి యుగయుగాలుగా ఇచ్చాడు. ఆ లక్ష్య సాధన దిశలో "నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనిద్దరం ఈ దేశానికి, ధర్మానికి, సంస్కృతికి రక్ష" అనే భావంతో రక్ష కట్టుకొని ఆ కర్తవ్యాన్ని జాగృతంగా ఉంచుకొందాము. అదే రక్షాబంధన్ మనకు ఇచ్చే సందేశం.