చట్టాన్ని ఉల్లంఘిస్తున్న క్రైస్తవులపై చర్యలెందుకు తీసుకోరు?

కలియుగాబ్ది 5114 , శ్రీ నందన నామ సంవత్సరం, శ్రావణ మాసం

క్రైస్తవులు తమ మతప్రచారాన్ని తమ మతస్థుల వద్ద చేసుకోవాలి. కాని హిందూ దేవాలయాల వద్ద, హిందువులు పండుగలు జరుపుకుంటున్నప్పుడు ప్రచారం చేయటాన్ని పాలకులు, సెక్యులరిస్టులు ఎందుకు ప్రశ్నించటం లేదు? గత కొద్ది సంవత్సరాలుగా క్రైస్తవుల ప్రచారం అనేక సమస్యలకు దారి తీస్తున్నది. గతంలో తిరుమల తిరుపతి దేవాలయం దగ్గర మతప్రచారం చేస్తూ, ఇంకా ఇతర ప్రసిద్ధ దేవాలయాల దగ్గర ప్రచారం చేస్తూ ఉద్రిక్త వాతావరణం నిర్మాణం చేసిన విషయాన్ని పరిగణనలోకి తీసుకొని హిందువులు ఆందోళనకు దిగిన విషయం అందరికీ తెలుసు. దాని కారణంగా 2007లో ప్రభుత్వం ఒక జీ.ఓ. జారీ చేసింది. దానిలో హిందువులకు చెందిన పుణ్యక్షేత్రాలలో ఇతర మతస్తులు కాని, ఇతర మతస్తుల ఆరాధనా స్థలాలలో హిందువులు కాని మత ప్రచారం చేయరాదని ఉన్నది. ప్రభుత్వం యొక్క చట్టాలను ఉల్లంఘిస్తూ క్రైస్తవులు చేస్తున్న ప్రచారంపై ప్రభుత్వం ఎందుకు తీవ్రంగా వ్యవహరించటం లేదు? చట్టపరమైన చర్యలు తీసుకోవటంలో ఎందుకు తాత్సారం చేస్తున్నది? అసలు దేవాలయాల వద్ద పనిచేసే వాళ్ళను హిందువులు కానివారిని ఎట్లా తీసుకొంటున్నారు? ఒకవేళ హిందువులు కూడా పని కట్టుకొని చర్చిల వద్ద ఆదివారం ప్రచారం చేస్తే పరిస్థితులు అదుపు తప్పే అవకాశం లేదా? ఇటువంటి సున్నిత సమస్యల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు హిందువులను అసంతృప్తికి గురిచేస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు 132 మంది అన్యమత ప్రచారం చేస్తున్నట్లు గుర్తించినట్లు పాలకమండలి ప్రకటించింది. ఇంతమంది హిందువేతరులను తిరుమలలో ఉద్యోగాలలోకి ఎట్లా తీసుకున్నారు? తిరుమలలో షాపులలో కూడా ఇతర మతస్తులు ఉన్నట్లుగా సమాచారం. ఇంత యోజన ప్రకారం సాగుతున్నా వాళ్ళపై 'చర్యలు తీసుకొంటాము' అనే ప్రకటిస్తున్నారు, కాని తీసుకోవటం లేదు.  ఇది గర్హించవలసిన అంశం. 

సెక్యులర్ ప్రభుత్వం హిందూ దేవాలయాలపై పెత్తనం చెలాయిస్తున్నది. అదే సమయంలో ఇతర మతాల ప్రార్థన స్థలాలలో ప్రభుత్వం వేలు కూడా పెట్టడం లేదు. దేవాలయాలలో పని చేసే ఉద్యోగులు హిందువులే అయి ఉండాలి. సెక్యులర్ పధ్ధతి పేరుతో దేవాలయాలలో హిందువేతరులను ఉద్యోగులుగా తీసుకొంటున్నారు. వారు 25 % మంది ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఈ విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటం హిందువులను అవమానపరచటమే. క్రైస్తవ మత ప్రచారాన్ని ప్రభుత్వం అదుపులో ఉంచలేకపోతే రాబోయే రోజులలో మరోసారి ఆందోళనకు దిగవలసి వచ్చే పరిస్థితులు నిర్మాణమవుతాయని హిందువులు హెచ్చరిస్తున్నారు.