మన ఆధ్యాత్మిక గురువెవరు ?

వివేక సూర్యోదయం - ధారావాహికం - 9
 
 
మనం ప్రస్తుతమున్న స్థితి మనం గతంలో చేసిన కర్మల ఫలితమే. మనం రాబోయే కాలంలో చేరే స్థితి కూడా మనం ప్రస్తుతం చేసే కర్మల మీద ఆధారపడి ఉంటుంది. అంతమాత్రం చేత మనకు ఎవరి సహాయము అవసరం ఉండదని కాదు. అంతః ప్రేరణకు బాహ్య ప్రేరణ తోడయితే మనలోని చేతనా శక్తి ద్విగుణీకృతమై ఆధ్యాత్మిక ప్రపంచం వైపు అడుగులు వేస్తాం. మనిషి అంటే శరీరమే అనుకొని దాని పోషణకు, సుఖానికి, వినోదానికి కావాల్సినవి సంపాదించుకోవడం, అవి దొరికితే ఆనందించడం, దొరక్కపోతే బాధపడడం భౌతికత అవుతుంది. ఈ భౌతికత నుండి బయటపడి, మనిషి అంటే చైతన్యమని, ఒక భావనాత్మక శక్తి అని, దాన్ని సరిగ్గా వినియోగించుకుని అంతరంగాన్ని ఉన్నతంగా మలుచుకొనడమే నిజమైన ఆనందమని, అదే ఆధ్యాత్మికత అని తెలుసుకొనడం సనాతన ధర్మజ్యోతి మనకిచ్చే శాశ్వత సందేశం. ఇది పుస్తకాలు చదివితే రాదు. అది ఎవరికి వారు ఏకత్వ దృష్టితో చూస్తే వస్తుంది. పుస్తకాలు చదివితే మేధ పెరుగుతుంది. కాని ఆధ్యాత్మికత పెరగదు. అందుకే పుస్తకాలు చదివి ఏ విషయమైనా మాట్లాడగలం కాని చేతలకొచ్చేసరికి లోపం కనపడుతూనే ఉంటుంది. పుస్తకాల నుంచి రాని ప్రేరణ శక్తి గురువు నుంచి లభిస్తుంది. చోదకశక్తి నిచ్చేవాడు గురువు, గ్రహించే వాడు శిష్యుడు. గురువు ఇవ్వగలిగి ఉండాలి. శిష్యుడు పుచ్చుకొనగలిగి ఉండాలి. వేసే విత్తనం బాగుండాలి. క్షేత్రం అందుకు బాగుండాలి. అప్పుడు ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ఇదే నిజమైన గురుశిష్య బంధం. వీళ్ళే నిజమైన గురువులు, శిష్యులు. మిగిలిన వారు ఆధ్యాత్మికతతో ఆటలాడుకుంటున్నవారే. మతం కోసం నిజమైన దాహం అపుడే పుడుతుంది. ఖచ్చితంగా ఆ సమయంలో అనుకున్న విధంగా జరిగితేనే వివేకం జాగృతమవుతుంది. అయితే ఇందులో ఓ ప్రమాదముంది. ఇది క్షణభంగురంయ్యే అవకాశం కూడా ఉంది. ఇది మన జీవితాల్లో కనపడుతుంది.

మన ఇంట్లో మనకు బాగా కావలసిన వాళ్ళు చనిపోతే మనం ఎంతో నిర్వేదానికి లోనవుతాం. అందుకే మనం ఆధ్యాత్మిక శిఖరాల నధిరోహించాలనుకుంటాం. కాని కొన్ని రోజుల తరువాత ఆ తరంగం మాయమౌతుంది. కనుక మనం అంతర్ముఖులం కావాలి. ఆ కోరిక మనలో నిజంగా ఉందా? ఆలోచించాలి. అలాగే ఇందులో ప్రతి ఒక్కరూ గురువై, తమకంతా తెలుసునంటూ తమతో పాటు మరికొందర్ని పిచ్చివాళ్ళను చేసే ప్రమాదముంది. అంధుడిని అంధుడు నడిపిస్తే ఇద్దరూ కలిసి గోతిలో పడే ప్రమాదముంది. ప్రతి భిక్షగాడూ మిలియన్ డాలర్ల కానుక సంపాదించాలని భావించినట్లే, ప్రతి ఒక్కరికీ గురుత్వం వహించాలనే కోరిక ఉంటుంది. కాబట్టి సరియైన గురువును ఎంచుకోవాలి.

- హనుమత్ ప్రసాద్