బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదార్ల కారణంగా అసోంలో చెలరేగుతున్న హింస యావత్తు దేశానికీ ఒక సవాలు

ర్.ఎస్.ఎస్. అఖిల భారత కార్యకారిణీ మండలి ఆమోదించిన తీర్మానం-2


2012 జూలైలో అసోంలోని కోక్రాఝర్, చిరాంగ్, ధుబరీ జిల్లాల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన ముస్లిం చొరబాటుదార్ల కారణంగా ఉత్పన్నమైన అశాంతిని, ఆ తర్వాత దేశంలోని వివిధ నగరాలలో జరిగిన హింసాత్మక నిరసన ప్రదర్శనలను, అలాగే దేశంలోని వివిధ భాగాలలో శాంతియుతంగా నివసించుతూ ఉన్న ఈశాన్య ప్రాంత ప్రజలలో బుద్ధిపూర్వకంగా పన్నిన కుట్రల ద్వారా భయభీతావహ వాతావరణం నిర్మాణం చేయబడిన తీరును, ఆ కారణంగా ఆయా ప్రదేశాల నుండి వారు పలాయనం సాగించవలసిన స్థితి ఏర్పరచడాన్నీ, వీటన్నింటినీ అఖిల భారత కార్యకారిణీ మండలి తీవ్రంగా గర్హిస్తున్నది. ఈ ఘటనలన్నీ యావత్తు దేశానికి ఒక సవాలుగా పరిణమించినవని అభిప్రాయ పడుతున్నది. అసోం, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలోకి నిరంతరంగా పెరుగుతూ వచ్చి పడుతున్న అక్రమ చొరబాట్ల కారణంగా అత్యంత గంభీరమైన సంకటస్థితి ఏర్పడింది.

2003వ సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కుదుర్చుకున్న ఒక ఒప్పందం ప్రకారం బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియా డిస్ట్రిక్ట్ లనేవి నాలుగు ఏర్పడినవి. ఇప్పుడు వాటిలోకి కూడా పెద్ద సంఖ్యలో అక్రమ చొరబాటుదార్లు చొరబడ్డారు. నివాసాలేర్పరచుకున్నారు. వారి కారణంగా అక్కడి ధార్మిక, సామాజిక, సాంస్కృతిక, ప్రాకృతిక, ఆర్థిక, ధార్మిక, రాజకీయ వాతావరణాలపై చెప్పలేనంత దుష్పరిణామం ఏర్పడింది. బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ లో తమకు కొన్ని స్థానాలను కచ్చితంగా కేటాయించాలన్న కోరికతోముస్లింలు 2012 మే 29న బంద్ కు పిలుపునిచ్చారు. కొన్ని రాజకీయ పక్షాల వారు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా రాజ్యాంగ విరుద్ధమైన వారి కోరికను బలపరుస్తూ సహకార మందించారు. 20 జూలైనాడు నలుగురు బోడో యువకులు ముస్లింల చేతుల్లో కిరాతకంగా హత్య చేయబడటంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆ తరువాత జరిగిన ఘటనలలో ప్రభుత్వం విడుదల చేసిన అంకెల ప్రకారంగానే 90 మంది ప్రాణాలు కోల్పోయారు. నాలుగు లక్షలమంది తమ ఇళ్ళు, వాకిళ్ళు విడిచిపెట్టి శరణార్థి శిబిరాలలో తలదాచుకున్నారు. సహాయమందించే నిమిత్తంగా ఏర్పరచిన ఈ శిబిరాల్లోకి కూడా చొరబాటుదార్లు పెద్ద సంఖ్యలోనే చొరబడ్డారు. వారిని గుర్తించి బయటకు పంపవలసిన అవసరముంది. ఈ దృష్టితో అసోంలో సమాజంలోని అనేక సంస్థల వారు కలసి, ఒక వేదిక మీదకు వచ్చి అక్రమ చొరబాటుదార్లకు అక్కడ పునరావాసం కల్పించనీయరాదంటూ తీసికొనిన సంకల్పం అభినందనీయమైనది.

రాజకీయ ప్రయోజనాల కోసం ఏ విషయంలోనైనా రాజీ పడడానికి అలవాటు పడిపోయన రాజకీయపక్షాలు, మతపరమైన సానుభూతితో ముస్లిం చొరబాటుదార్లకు అండగా ఉండే స్థానిక నివాసులు అక్రమంగా అందిస్తున్న సహకారంతో అక్రమ చొరబాటుదార్లు అక్కడి భూమిని, అడవిని, ఉపాధి సదుపాయాలను, ఇతర వనరులనూ హస్తగతం చేసుకొని, స్థానిక రాజకీయాలలో తమది పై చేయిగా నిరూపించుకొనేంతవరకూ సఫలమైనారు. అక్రమ చొరబాటుదార్లకు సమర్థనను, సహకారాన్నిఅందిస్తున్న శక్తులపై, బృందాలపై కఠిన చర్యలు తీసికోవటం ఎంతైనా అవసరం. అసోంలో ఇటీవల జరిగిన ఘటనలను, విశేషించి బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదార్ల సమస్యను ముస్లింలకు సంబంధించిన సమస్యగా చిత్రీకరించే ప్రయత్నాలను అఖిల భారత కార్యకారిణీ మండలి నిరసిస్తున్నది. ముస్లింలలో తీవ్రవాద కొత్త కెరటం వెల్లువలా పైకి లేస్తున్నదంటూ పార్లమెంటు లోపలా బయటా చేసిన రెచ్చగొట్టే స్వభావం గల వ్యాఖ్యలను గర్హించవలసి ఉంది. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలలో కొందరు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు ఎంపిక చేసుకొన్న శిబిరాలను మాత్రమే దర్శించి స్థానిక ప్రజలకూ, విదేశీయ చొరబాటుదార్లకు మధ్య జరిగిన ఘటనలకు మతపరమైన రంగు పులమడానికి చేస్తున్న ప్రయత్నాలను కూడా గర్హించవలసియున్నది.

అసోం ఘటనలను పురస్కరించుకొని ముంబై, ప్రయాగ (అలహాబాద్) లక్నో, కాన్పూర్, బరేలీ, అమదావాద్, జోధ్ పూర్ వంటి అనేక నగరాలలో ముస్లిం మతమౌఢ్య వర్గాల వారు సునియోజితమైన రీతిలో హింసాత్మక ప్రదర్శనలను నిర్వహించి దేశ ప్రజలందరినీ అలోచనల్లో పడవేశారు. ముంబైలో నిరసన ప్రదర్శనకారులు పత్రికలకు, ప్రసార మాధ్యమాలకు చెందిన ప్రతినిధులపై దాడి చేశారు. సామాన్య ప్రజలపై విరుచుకుపడ్డారు. పోలీసులను తీవ్రంగా గాయపరిచారు. వారి నుంచి ఆయుధాలు లాక్కొనేందుకు యత్నించారు. అమర్ జవాన్ స్కృతి చిహ్నం వంటి జాతీయ స్మారకాలను అవమానించారు. వాటిని పూర్తిగా ధ్వంసం చేసేందుకు యత్నించారు. మహిళా పోలీసులపై కూడా అవమానకరమైన రీతిలో దుర్వ్యవహారం సాగించారు. శాంతి భద్రతలను రక్షించే బాధ్యతగల ప్రశాసనిక వ్యవస్థ ఇటువంటి ఘటనలు జరుగగల అవకాశాన్ని ముందుగా పసిగట్టలేకపోవటమే కాదు, ఈ నేరాలకు, పాపాలకు ఒడిగట్టిన వారిని వెంటనే పట్టుకొని, తగిన చర్యలు తీసికోవాలనే ఇచ్ఛాశక్తిని చూపించటంలోనూ ఘోరంగా విఫలమవుతున్నది. 

ఈ సందర్భంలోనే జాతి వ్యతిరేక శక్తులు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈశాన్య ప్రాంత ప్రజలకు నేరుగా సందేశాల ద్వారా "రంజాన్ తర్వాత అసోంలో జరిగిన ఘటనలకు ప్రతీకారం చేయటం జరుగుతుందని" బెదిరించడం ఆరంభించారు. ఫలితంగా పుణే, బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల నుండి పెద్ద సంఖ్యలో ఈశాన్య ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు తమ కార్యస్థానాలను వదలి, తమ ఊళ్ళ వైపుగా పారిపోవలసి వచ్చింది. అటువంటి సంకట సమయంలో జాతీయ ఏకాత్మ భావనను వ్యక్తం చేస్తూ తమ బాధ్యతను నిర్వహించే సంసిద్ధత ప్రకటిస్తూ అనేకచోట్ల వేలాదిగా దేశభక్తులు ముందుకు వచ్చి భయంతో వెళ్ళిపోతున్న వారికి ధైర్యం చెప్పి, నమ్మకం కలిగించి, తమ తమ స్థానాలను విడిచిపోవద్దని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వారి భద్రతకు తగు ఏర్పాట్లను చేశారు. అవసరమైన సహాయమిందిస్తూ తోడు నిలిచారు. ఈ కారణంగానే భయంతో కూడిన వాతావరణం దేశంలోని మిగతా ప్రాంతాలకు వ్యాపించకుండా ఆగిపోయింది. ఈశాన్య ప్రాంత ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ విధంగా వ్యవహరించిన దేశవాసులను అఖిల భారత కార్యకారిణీ మండలి మెచ్చుకొంటున్నది. అదే సమయంలో దేశప్రజలందరూ మీకు తోడు నిలుస్తారని ఈశాన్య ప్రాంత ప్రజానీకానికి ఆశ్వాసననిస్తూన్నది. భయాన్ని వ్యాపింపచేసే దేశ వ్యతిరేక శక్తులను గుర్తించి, వెదికి పట్టుకొని కఠినంగా దండించాలని అఖిల భారత కార్యకారిణీ మండలి ప్రభుత్వాన్ని కోరుతున్నది. 

అక్రమ చొరబాట్లు సాగిపోతుండడానికి 1983లో రూపొందించబడిన ఐ.ఎం.డి.టి. (ఇల్లీగల్ మైగ్రెంట్ డిటర్మినేషన్ బై ట్రిబ్యునల్స్) చట్టం ఒక కారణమని గ్రహించి సర్వోచ్ఛ న్యాయస్థానం ఆ చట్టాన్ని న్యాయవిరుద్ధమైనదిగా ప్రకటించింది. ఢిల్లీ, గువాహటీలలోని ఉచ్ఛ న్యాయస్థానాలు అక్రమ చొరబాటుదార్లను బయటకు వెళ్ళగొట్టాలని స్పష్టమైన నిర్దేశాలు ఇచ్చినప్పటికీ కేంద్రప్రభుత్వం, అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ఓట్ బ్యాంక్ రాజకీయాలలో భాగంగా అక్రమ చొరబాటుదార్లకు వత్తాసు నిస్తున్నవి. బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి చొరబడినవారు క్రమక్రమంగా దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించారు. వారి కారణంగా ప్రతి ప్రాంతంలో జనాభాలోని అంతర్గత నిష్పత్తులు మారిపోతున్నాయి. అనేక రకాల ప్రమాదకరమైన, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో నిమగ్నమై, వారు దేశాన్ని సంకటగ్రస్త స్థితిలోపడవేస్తున్నారు. నకిలీ నోట్ల చలామణి, దొంగచాటుగా ఆయుధాల సరఫరా వ్యాపారం, మత్తు పదార్థాల అమ్మకం, గోవులను దొంగిలించుకుపోవటం వంటి కార్యకలాపాలకు పాల్పడుతూ ఐ.ఎస్.ఐ. (పాకిస్తాన్ గూఢచారి సంస్థ) కార్యకలాపాలకు సాధనాలుగా ఉంటున్నారు. 

అఖిల భారత కార్యకారిణీ మండలి కేంద్రప్రభుత్వాన్ని, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలనూ ఈ విధంగా కోరుతున్నది. 

1946 నాటి ఫారినర్స్ యాక్ట్ ప్రకారం, సర్వోచ్ఛ న్యాయాలయంతో సహా వివిధ న్యాయస్థానాలు జారీచేసిన ఆదేశాలను పాటిస్తూ సూక్ష్మంగా వెదికిపట్టుకొని బంగ్లాదేశీయులైన చొరబాటుదార్లకు పౌరులకు లభించే సదుపాయాలను, సౌకర్యాలనూ నిరాకరిస్తూ, వెంటనే వారిని దేశం నుంచి బయటకు పంపివేయాలి. 

అక్రమ చొరబాటుదార్లైనవారు తమ పేర్లు ఓటర్ల జాబితాలో చేర్పించుకొని ఉండవచ్చు. అలాంటి పేర్లను ఓటర్ల జాబితా నుంచి వెంటనే తొలగించాలి. అసోంలో జరిగిన హింసాత్మక ఘటనల కారణంగా తమస్థానాన్ని వదలివచ్చిన వారికి తిరిగి పునరావాసం కల్పించే సమయంలో చొరబాటుదార్లు ఆ అవకాశాలను దొరకబుచ్చుకొనేందుకు అవకాశమీయరాదు. ఎవరికీ ఆధార్ కార్డులను జారీ చేయరాదు. భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద కంచె ఏర్పాటు చేసే పనిని త్వరగా పూర్తి చేయాలి. జాతీయ స్థాయి పౌరుల రిజష్టరు (నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్) ను వెంటనే పూర్తిచేసి దానిని సువ్యవస్థితం చేయాలి. ఈ సమస్యను ఒక జాతీయ సమస్యగా గ్రహించుకొని అన్ని చోట్లా విదేశీయ చొరబాటుదార్లను గుర్తించి, వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగింపచేసే కార్యంలో క్రియాశీలక పాత్ర వహించవలెనని దేశభక్తులైన పౌరులందరిని అఖిల భారత కార్యకారిణీ మండలి గట్టిగా కోరుతున్నది. విదేశీయ అక్రమ చొరబాటుదార్లను ఏ విధమైన పనిలోనూ నియోగించుకొనరాదని, వారికి ఉపాధి సౌకర్యాలు కల్పించినట్లయితే అది చట్టవిరుద్ధం కావటమే కాక, దేశ విఘాతమని కూడా గుర్తించాలని అఖిల భారత కార్యకారిణీ మండలి దేశ ప్రజలందరికీ గుర్తు చేయగోరుతున్నది. 

అఖిల భారత కార్యకారిణీ మండలి సమావేశాలలో వేదికపై ఆసీనులైన పూజ్య సర్ సంఘచాలక్ మోహన్ జీ భాగవత్, సర్ కార్యవాహ సురేష్ జీ జోషి