పాపం సోనియాకు ఏం తెలియదు..?


కుంభకోణాలు. ఎనిమిదేళ్ల యూపీఏ పాలన మొత్తం వరుస కుంభకోణాల మయం. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీకి తన చత్రచాయల్లో పని చేస్తున్న ప్రభుత్వంలో రోజుకో కుంభకోణం వెలుగు చూస్తున్నా భయంకానీ జంకు కానీ లేనేలేవు. 

మనది 120కోట్ల జనాభా గల అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. భారత్ కంటే అత్యంత చిన్న దేశాల్లో ఇటలీ ఒకటి. ప్రస్తుతం మన దేశ సైనిక బలగాల ఆయుధ అవసరాలు తీరుస్తున్న దేశాల్లో ఇటలీ ఒకటి. ఈ విషయంలో ఇటలీ వాటా 8.5శాతంగా ఉంది. ఇది 2007లో కేవలం 2 శాతం మాత్రమే. ఈ ఆయుధాల విలువ దాదాపు 323 బిలియన్ డాలర్లు. అంతేకాదు, భారత్ కు ఆయుధాలు ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఇటలీది ఐదో స్థానం. 1980లో ఏవో కొన్ని రాడార్లు, నౌకా విధ్వంసక ఆయుధాలు సరఫరా చేసిన ఇటలీ కంపెనీలు సోనియా నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి రావడంతో దూకుడు పెంచాయి. 

ఇప్పటివరకు భారత సైనిక దళాల ఆయుధ అవసరాలు తీరుస్తున్న రష్యా, బ్రిటన్, ఇజ్రాయిల్ దేశాలతో సమానంగా ఇటలీ ఎదగటానికి కారణం ఎవరు? ఈ కొనుగోళ్ల వెనుక ఎవరి హస్తం ఉంది? విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఇటీవల బయటపడిన ఆగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో ఈ అదృశ్య శక్తి హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దేశంలో VVIPలు ప్రయాణ అవసరాల కోసం 12 W101 హెలికాప్టర్లను కొనేందుకు రూ.3500 కోట్లతో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇటలీకి చెందిన ఫీన్ మేకానికా కంపెనీ సీఈవో ఈ కొనుగోళ్ల ఒప్పందం కోసం భారత్ లోని అధికారులకు ఏకంగా 360 కోట్ల రూపాయలను లంచంగా ఇచ్చినట్లుగా ఇటలీ దర్యాప్తు సంస్థలే నిర్ధారించాయి. ఆ కంపెనీ సీఈవోను అరెస్ట్ చేసేవరకు కూడా మన దేశంలోని మీడియా కానీ ప్రభుత్వం కాని స్పందించలేదు. ఆలస్యంగా మేల్కొన్న ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో సర్కార్ దిగివచ్చంది. ఇటలీకి సిబిఐ బృందాన్ని పంపారు. 

అయితే ఈ ఇటలీ టూర్ కుంభకోణానికి సంబంధించిన ముఖ్య అధారాలను మాత్రం సేకరించలేకపోయారు. అటు రక్షణ మంత్రి కూడా తన వద్ద దాచిపెట్టడానికి ఏం లేదని, దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) విచారణకు సైతం తాను సిద్ధమనీ ప్రకటించారు. ఇటు ప్రభుత్వం కూడా హెలీ స్కామ్ పై జెపిసి వేసేందుకు సిద్ధమైంది. యూపీఏ పాలనలో వెలుగు చూస్తున్న ఈ కుంభకోణాలకు నైతిక బాధయత యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీదే. ఆమెకు తెలియకుండా పాలన పరమైన నిర్ణయాలు, కొనుగోళ్లు జరుగుతున్నాయంటే దేశంలో సామాన్య ప్రజానీకం విశ్వసించారు. అయితే మేడం తనకు ఏ పాపం తెలియదని చెబుతున్నారు. అంతేకాక తాను పుట్టి పెరిగిన ఇటలీ దేశ వ్యాపారులు ఇచ్చిన లంచాల గురించి అసలు తెలియదంటున్నారు. 

సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ఇప్పటికే పేరుబడిన తరువాత ఈ కుంభకోణంపై విచారణ సజావుగా సాగుతుందా? ఇది కూడా మరో బోఫార్స్ కేసా? జస్ట్ వెయిట్ అండ్ సీ...  

- నారద