2014-15 సంఘ విస్తరణ సంవత్సరంఆర్.ఎస్.ఎస్. అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాలలో సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ జీ భాగవత్ ప్రసంగం
మార్చి 13,14,15 తేదీలలో నాగపూర్ లో జరిగిన సమావేశాలు
2014-15 దేశవ్యాప్తంగా సంఘపని విశేష విస్తరణ జరిగిన సంవత్సరంగా గుర్తింపు
మాననీయ భాగయ్యగారు సహ సర్ కార్యవాహగా, శ్యాంకుమార్ గారు క్షేత్ర ప్రచారక్ గా ప్రకటన
2015 మార్చి 13,14,15 తేదీలలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ అఖిల భారత ప్రతినిధి సభ (All India General Body Meetings) సమావేశాలు నాగపూర్ లో జరిగాయి. సమావేశాలు 13వ తేదీ ఉదయం 8.30 గంటలకు భారతమాత విగ్రహం ముందు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా 1462 మంది అపేక్షితులు కాగా 1379 మంది ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.
సభ ప్రారంభంలో సర్ కార్యవాహ మా.సురేష్ జీ జోషి (భయ్యాజీ జోషి) గడిచిన 2014-15 సంవత్సరం దేశవ్యాప్తంగా పెరిగిన సంఘ శాఖల విస్తరణ, సంఘ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాల వివరాలు వివరించారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విశేషంగా సంఘశాఖలు పెరిగాయి. ఈ రోజున దేశవ్యాప్తంగా 33,222 స్థలాలలో 51,330 శాఖలు (దైనందిన) నడుస్తున్నాయి. వారానికి ఒకసారి నడిచే శాఖలు 12,847, నెలకు ఒకసారి జరిగే శాఖలు 9008 ఉన్నాయి. మొత్తం మీద దేశవ్యాప్తంగా 55,010 గ్రామాలు, నగరాలలో సంఘపని ఉత్సాహంగా జరగుతున్నది. సంఘములో కార్యవిభాగమైన సేవా మాధ్యమంగా దేశవ్యాప్తంగా 1,52,388 సేవాకార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. విద్యా, వైద్య, సామాజిక, స్వావలంబనకు సంబంధించి సేవా కార్యక్రమాలు సంఘము ద్వారా నిర్వహించబడుతున్నాయి. గత సంవత్సరం కంటే విశేషంగా సేవ కార్యక్రమాలు కూడా పెరిగాయి. దేశంలో సమస్యాగ్రస్థమైన ఈశాన్య రాష్ట్రాలలో కూడా సంఘ కార్యక్రమాలు ఈ సంవత్సరం విశేషంగా నిర్వహించబడ్డాయి. అందులో మణిపూర్ లో జరిగిన ఏకల విద్యాలయాల కార్యక్రమంలో పూ.మోహన్ భాగవత్ గారు పాల్గొన్నారు. 2014 డిశంబరు 7న మణిపూర్ లో జరిగిన సార్వజనిక సభా కార్యక్రమంలో మణిపూర్ మహరాజ్ శ్రీ Laisemba Sanachauba అధ్యక్షత వహించారు. మోహన్ భాగవత్ గారు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి మణిపూర్ ప్రాంతంలోని 400 గ్రామాల నుండి 7,000 మంది ప్రజలు పాల్గొన్నారు.
సర్ కార్యవాహ గారి నివేదికలో ప్రస్తుత కేంద్రప్రభుత్వం ద్వారా చేపట్టిన స్వచ్ఛభారత్, గంగానది సురక్షా మొదలైన ప్రజా ఉపయోగ కార్యక్రమాలలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తే ఆ కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఇటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించడం స్వాగతించదగినదని వివరించారు. తెలంగాణ ప్రాంతంలో ధార్మిక జాగరణ కోసం నిర్వహించబడిన జనజాగరణ కార్యక్రమం 2015 ఫిబ్రవరి మాసంలో విజయవంతంగా నిర్వహించబడింది.
సమాజ సమగ్ర వికాసం కోసం దేశవ్యాప్తంగా పనిచేస్తున్న వివిధ సంస్థల నివేదికలు కూడా ఆ సభలో ఇవ్వబడ్డాయి. సమాజంలోని అన్నిరంగాలలో ఈ రోజు సంఘ స్వయంసేవకుల ద్వారా ఆ రంగాల వికాసం కొరకు అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. దానిద్వారా సమాజంలో మంచి మార్పు వస్తున్నది. ఉదాహరణకు విజ్ఞానభారతి, సీమాజనకళ్యాణ పరిషత్ ల ద్వారా జరుగుచున్న కార్యక్రమాలు చూద్దాం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్యత పెరుగుతున్నది. దానిదృష్ట్యా ప్రతి సంవత్సరం ఆయుర్వేద సమ్మేళనం ఒకటి ఏర్పాటు చేయబడుతున్నది. 2014 నవంబరు మాసంలో నాల్గవ విశ్వ ఆయుర్వేద సమ్మేళనం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో ప్రపంచంలోని ఏడు దేశాల ఆరోగ్యశాఖమం్రతులు కూడా పాల్గొన్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదనాంలో ఆయుర్వేదంపై ఒక విశాల ప్రదర్శిని ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శినిని సుమారు లక్షమందికి పైగా ప్రజలు దర్శించారు. ప్రముఖ శాస్త్రేత్తలతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీమాజనకళ్యాణ పరిషత్ : దేశ సరిహద్దులలో 67 జిల్లాలున్నాయి. సరిహద్దులు సముద్రతీరం 8 రాష్ట్రాల్లో ఉన్నది, రహదారులు 12 రాష్ట్రాల్లో ఉన్నవి. సరిహద్దులలో ఉన్న 67 జిల్ఆలలో 27 జిల్లాలలో సీమాజనకల్యాణ పరిషత్ ద్వారా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో 1) సరిహద్దు భద్రతపై ప్రజలకు అవగాహన కలిగించడం, 2) అక్కడి ప్రజలు స్వావలంబనతో ఉండేందుకు వివిధ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. ఇట్లా దేశానికి సంబంధించిన అన్ని రంగాలలో మార్పు కోసము సంఘ స్వయంసేవకులు కృషిచేస్తున్నారు. అంతర్జాతీయ యోగదివస్ జూన్ 21న ప్రతి సంవత్సరం నిర్వహించబోతున్నట్లు UNO (యు.ఎన్.ఓ.) ద్వారా ప్రకటించబడింది. ఈ కార్యక్రమ ప్రకటనకు హర్షం వ్యక్తం చేస్తూ భారతీయ జీవనవిధానంలో యోగ ఒక భాగము. యోగ ద్వారా ప్రపంచ ప్రజలందరూ ఆరోగ్యవంతులవ్వాలి. మన యోగకు విశేషప్రాధాన్యత సంతరించుకోవటం మనందరికి గర్వకారణం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటలో దేశప్రజలందరం భాగస్వాములం కావాలని సర్ కార్యవాహ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా 2 తీర్మానాలు ఆమోదించబడ్డాయి. 1) సమాజంలో భౌగోళికంగా చిన్నయూనిట్ గ్రామం. అందులో చిన్న యూనిట్ కుటుంబం. కుటుంబవ్యవస్థ ఈ దేశప్రత్యేకత. ఈ దేశానికి శ్రీరామరక్ష. అటువంటి కుటుంబ వ్యవస్థ మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పటిష్టం చేసేందుకు విశేష ప్రయత్నం చేయాలి. 2) దేశంలో సామాజికంగా మనం శక్తివంతం కావాలంటే సమాజంలోని సామాజిక సమస్యలు పరిష్కరింపబడాలి. దేశంలో సమరసత వాతావరణం ఏర్పడాలి, కులాలు, మతాలు, భాష, ప్రాంత అంతరాలు సమసిపోయి సమరసత వేదిక ద్వారా నిర్వహింపబడుతున్న కార్యక్రమాలను, పనిని వేగంగా విస్తరింపచేయాలని పిలుపునిచ్చారు. 3) మన సమాజము ధార్మిక సమాజం అంటే ధర్మం ఆధారంగా మన జీవనం ఉంటుంది. మన ధర్మాన్ని రక్షించుకోవటం మన అందరి కర్తవ్యం. తద్వారానే సమాజం శక్తివంతమవుతుంది. దానికోసమే ధార్మిక జాగరణ కార్యక్రమాలు విశేషంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
పరస్పర పూరకమైన ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ హిందూసమాజాన్ని శక్తివంతం చేయాలని పిలుపునిచ్చారు.
మూడు సంవత్సరాలకు ఒకసారి సంఘములో ఎన్నికలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఎన్నికల సంవత్సరము. ఈ ఎన్నికలు సర్ కార్యవాహగారి ఎన్నికతో పూర్తి అవుతాయి. మా.సురేష్ జోషి (భయ్యాజీ జోషి) తిరిగి ఎన్నుకోబడ్డారు. దీనితో సంఘ ఎన్నిక ప్రక్రియ పూర్తి అయ్యింది. సర్ కార్యవాహ గారు రాబోవు మూడు సంవత్సరాలకు తన కార్యవర్గాన్ని కూడా ప్రకటించారు. ఈ సంవత్సరం చేసిన ప్రకటనలో సంఘంలో ఉన్నత స్థాయిలో మూడవ స్థానమైన సహ సర్ కార్యవాహగా తెలంగాణ ప్రాంతానికి చెందిన శ్రీ భాగయ్యగారి పేరు ప్రకటించబడింది. వీరు ఇప్పటివరకు అఖిల భారత బౌద్ధిక్ ప్రముఖ్ గా ఉన్నారు. కలకత్తా కేంద్రంగా దేశమంతా వారు పర్యటన చేస్తారు. తెలంగాణ ప్రాంత ప్రచారక్ గా ఉన్న శ్రీ ఏలే శ్యాంకుమార్ ను ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు ప్రచారక్ గా (క్షేత్ర ప్రచారక్) ప్రకటించారు. సహప్రాంత ప్రచారక్ గా ఉన్న శ్రీ దేవేంద్రను ప్రాంత ప్రచారక్ గా ప్రకటించారు. ప్రస్తుత క్షేత్ర ప్రచారక్ గ ఉన్న శ్రీ మంగేశ్ జీ భెండేగారిని అఖిల భారత వ్యవస్థా ప్రముఖ్ గా ప్రకటించారు. నాగపూర్ కేంద్రంగా వారు పనిచేస్తారు. తెలంగాణ ప్రాంత సహకార్యవాహగా ఉన్న శ్రీ కాచం రమేష్ గారికి అదనంగా క్షేత్ర బౌద్ధిక్ ప్రముఖ్ గా కూడా బాధ్యత ప్రకటించారు. గతంలో క్షేత్ర బౌద్ధిక్ ప్రముఖ్ గా ఉన్న శ్రీ నాగరాజుగారు క్షేత్ర సంఘచాలక్ గా ఎన్నుకోబడ్డారు. తెలంగాణ ప్రాంత వ్యవస్థా ప్రముఖ్ గా ఉన్న శ్రీ భాస్కర్ గారు దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ ప్రముఖ్ గా ప్రకటించబడ్డారు. రాబోవు 3 సంవత్సరాలపాటు ఈ కార్యకారిణి పనిచేస్తుంది.