అన్నదాతలను ఆదుకొనేందుకే భూసేకరణ బిల్లు

'మన్ కీ బాత్' కార్యక్రమంలో స్పష్టం చేసిన ప్రధాని మోది
 - రైతులు పేదలుగానే ఉండాలా...
- ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి...
- అన్నదాతల మేలు కోసమే ఈ బిల్లు...
రైతుల మేలు కోసమే భూసేకరణ బిల్లును తీసుకొచ్చామని ప్రధాని నరేంద్రమోది స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, వారి మాటలను నమ్మవద్దని రైతులను కోరారు.
ఆకాశవాణిలో నెలనెలా నిర్వహించే 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్రమోది మార్చి 22న రైతులతో మాట్లాడారు. అన్నదాతలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలూ తీసుకోబోనని హామీనిచ్చారు. పరిహారాన్ని తగ్గించడానికే బిల్లు తీసుకొస్తున్నారని వస్తోన్న వదంతులను నమ్మరాదని అన్నారు. రైతులకు మేలు చేసేలా బిల్లులో ఎటువంటి మార్పులు చేయడానికైనా సిద్ధమని ప్రధాని చెప్పారు. రైతులపై ప్రేమ ఉందని చెప్పుకొనేవాళ్ళు స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటికి 65 ఏళ్ళు గడిచినా 120 ఏళ్ళ క్రిందినాటి చట్టాన్ననుసరించి భూసేకరణ జరిపారని మోదీ గుర్తుచేసారు. 2013లో యూపిఏ ప్రభుత్వం హడావిడిగా భూసేకరణ చట్టం చేసిందని, దానిని నాటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, హర్యానాలే సరిగా అమలు చేయలేదని ప్రధాని వివరించారు.
చట్టంలో మార్పులు చేయాలంటూ అనేక రాష్ట్రాలు కోరినమీదట తాము బిల్లును సరిచేసే ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని ప్రధాని మండిపడ్డారు. పాతచట్టం ప్రకారం భూమి కోల్పోయిన రైతులకు పాతరేట్ల ప్రకారం నష్టపరిహారం వెల్లడించిన ప్రధాని.. తాజాగా ఎన్డీయే ప్రతిపాదించిన సవరణ బిల్లు ప్రకారం భూములిచ్చిన రైతులకు మార్కెట్ రేటు ప్రకారం నాలుగింతల నష్టపరిహారం లభిస్తుందని తెలిపారు. పట్టణీకరణకు సేకరించే భూమికిగాను రైతులకు అభివృద్ధి చేసిన 20 శాతం భూమి లభిస్తుందని మోదీ చెప్పారు.
తమ ప్రభుత్వం కార్పొరేట్లకు మేలు చేస్తోందన్న ఆరోపణలను ప్రధాని తోసిపుచ్చారు. రైతులకు, వారి పిల్లలకు, వారి గ్రామాలకు మేలు చేయటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని చెప్పారు. తనను నమ్మాలని, తనపై ఉంచే నమ్మకాన్ని వమ్ము చేయబోనని ప్రధాని హామీనిచ్చారు.
దేశం నలుమూలలా నుంచి రైతులు వ్రాసిన ఉత్తరాలను చదివిన ఆయన రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను చూస్తుంటే తనకు సిగ్గేస్తోందని చెప్పారు. అన్నదాతలు లేవనెత్తిన సమస్యలపై ప్రభుత్వ యంత్రాంగాన్ని మేల్కొల్పుతానని, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ప్రధాని హామీనిచ్చారు. రైతులకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తేనే తమకు పాలించే హక్కు ఉంటుందన్నారు.
30 నిమిషాలకు పైగా సాగిన ఈ కార్యక్రమంలో ప్రధాని రైతుల హృదయాలను గెలుచుకోగలిగారు.