'దీప'మాలిక (క్)


ఓ యువతీ మేలుకో...

మేధస్సులోనే కాదు...
ధైర్యం, సాహసంలో కూడా తనకు సాటిలేరు.
కదనరంగంలో అపరకాళిలా ఉన్నా...
సమస్యల వలయంలో ఉన్నా...
సహనం కోల్పోకుండా...
తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది.
ఎంత ఓర్పును కనబరుస్తుందో...
అన్ని విజయాలను సాధిస్తుంది.
అందుకే కాబోలు ఆమె ముందు...
వైకల్యం కూడా తలదించుకుంది.
హిమాలయాల్లో బైక్ ను నడిపి...
హిమాలయం అంత ఎత్తుకు ఎదిగింది.

దీపామాలిక్ ఒక మహిళ. అహ్మద్ నగర్ వాసి. వీరసైనికుడైన విక్రంసింగ్ భార్య. అది కార్గిల్ యుద్ధ సమయం. భర్త కార్గిల్ లో శత్రవుతో పోరాడితే, భార్య ట్యూమర్స్ వ్యాధితో యుద్ధం చేసింది.  ఫైనల్ గా మూడు సర్జరీలు, 13 కుట్లు. అక్కడ కార్గిల్ లో భారత్ విజయం. ఇక్కడ ఆపరేషన్ సక్సెస్. దీపా కాళ్ళు కదపలేని అంగవైకల్యంపై కూడా విజయం సాధించింది. ఆటలవైపు తన దృష్టిని మళ్ళించింది. దీపకు హైపోధైరాయిడిజం కూడా ఉంది. ఒక అథ్లెట్ గా ఆమెకు బరువును కంట్రోల్ చేసుకోవటం చాలా అవసరం. మితాహారం తింటూ తన బరువును కంట్రోల్ చేసుకుంటున్నది.
వికలాంగురాలైన దీపా ఆటల్లోనే కాదు, బిజినెస్ లో కూడా తన ప్రతిభను చాటుకొంది. తన స్వంతకాళ్ళపై నిలబడాలని అనుకుంది. అహ్మద్ నగర్ లో రెస్టారెంట్ ను ప్రారంభించింది. ఆమె ఆసక్తికి మెచ్చి భారతప్రభుత్వం స్వావలంబన్ అవార్డుతో సత్కరించింది.
దీపా దేశంలోనే మొదటి పారాప్లెజిక్ ఉమెన్ స్పోర్ట్స్ బైకర్, స్విమ్మర్, ఎంట్రప్రిన్యూర్. ఇంకా మోటివేషనల్ స్పీకర్ కూడా. మోటార్ బైక్ రైడింగ్ పై ఇష్టంతో హిమాలయన్ మోటార్ స్పోర్ట్స్ లో సభ్యత్వం తీసుకొంది. హిమాలయాల్లో మైనస్ డిగ్రీ టెంపరేచర్లో ఎనిమిది రోజులపాటు 1700 కి.మీ. బైక్ రైడ్ చేసింది. పారాలంపిక్స్ లో బైక్ రేజింగ్, యమునా నదిలో ఈత.. ఇలా అడ్వెంచర్స్ లో కెరీర్ ను మలుచుకున్నది. జావెలింగ్ త్రోలో బెంజ్ మెడల్, స్విమ్మింగ్ లో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. తన వైకల్యమే తనను ఫోకస్ చేసింది. విజయాలను సాధించడానికి ఆత్మవిశ్వాసం, గుండెనిబ్బరం, కావల్సినంత ధైర్యం ఉంటే చాలు, వైకల్యంతో పనిలేదని నిరూపిస్తోంది ఈ మహిళ. అందుకే ఈ వీర నారిని భారతప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది.
'సుశీలా, సుధీరా, సమర్థా సమేతా
స్వధర్మే, స్వమార్గే పరం శ్రద్ధయా'
కష్టాలు వస్తూనే ఉంటాయి. వాటన్నింటినీ ఎదుర్కోవడనికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ధైర్యం, ఓపిక, పట్టుదల ఉన్నంతకాలం విజయాలను సాధించి తీరుతాం.
 - లతా కమలం