ప్రాథమిక విద్య మాతృభాషా మాధ్యమంగా జరగాలి
ఆర్.ఎస్.ఎస్. అఖిల భారత ప్రతినిధి సభ తీర్మానం-2
విదేశీ భాషలతో సహా వివిధ భాషలను అధ్యయనం చేయటం గురించి అఖిల భారతీయ ప్రతినిధి సభ సమర్థించే వైఖరితోనే ఉన్నా, విద్యాభ్యాసం సహజమైన రీతిలో జరగాలన్నా, సంస్కృతిని రక్షించుకోవాలన్నా - విద్య, మరీ ముఖ్యంగా ప్రాథమిక విద్య మాతృభాషా మాధ్యమంలోనే జరగాలని, లేదంటే రాజ్యాంగంలో స్వీకరింపబడిన ప్రాంతీయ భాషల మాధ్యమంలో జరగాలని స్పష్టంగా తెలియచేయగోరుతున్నది.
భాష అనేది ఒకరి కష్టసుఖాలను, అభిప్రాయాలను మరొకరికి తెలియజెప్పేందుకే పరిమితమైనది కాదు, సంస్కృతిని, జాతీయ సంస్కారాలను ఒకతరం నుండి మరొకతరానికి అందజేసే వాహిక కూడా. భారతదేశంలో అనేక భాషలు వాడుకలో ఉన్నది. ఇవన్నీ కూడా మన జాతీయ అస్తిత్వాన్ని, సాంస్కృతికమైన వైశిష్ట్యాన్ని సమానంగా అభవ్యక్తీకరిస్తున్నవి. అనేక భాషలను తెలిసికొని ఉండటం ఒక సుగుణం. అయితే వ్యక్తి వికాసంలో మాతృభాష ద్వారా పొందే శిక్షణ కీలకపాత్ర వహిస్తుందని వైజ్ఞానికంగా కూడా ఋజువైంది. మాతృభాషలో విద్యాభ్యాసం చేసిన వ్యక్తి ఇతర భాషలను కూడా సహజంగా, సులభంగా నేర్చుకోగలడు. తొలిదశ విద్యాభ్యాసమే విదేశీ భాషలో జరిగేటట్లయితే, ఆ విద్యార్థి తన పరిసరాల గురించిన పరిజ్ఞానం లోపించినవాడై, తన సంస్కృతి సంప్రదాయాల గురించి, జీవితపు విలువల గురించి తెలుసుకోలేని వాడు కావటమే గాక, తన జాతీయమైన పరంపరాగతమైన జ్ఞానవిజ్ఞానాలను, సాహితీ సంపదను గ్రహించుకోలేక తన అస్తిత్వాన్ని, గుర్తింపునే కోల్పోతాడు.
పండిత మదనమోహన మాలవీయ, మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్ ఠాకూర్, శ్రీమాత, డా.భీమరావ్ అంబేడ్కర్, డా.సర్వేపల్లి రాధాకృష్ణ వంటి సుప్రసిద్ధులైన మేధావులు, విద్యావేత్తలు అయిన వారి నుండి మొదలుకొని సి.వి.రామన్, ప్రఫుల్లచంద్రరాయ్, జగదీశ్ చంద్రబోస్ ల వంటి విజ్ఞానవేత్తలు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా ఎందరెందరో మాతృభాషా మాధ్యమంలో సాగే విద్యాభ్యాసమే సహజమైనదని, వైజ్ఞానికమైనదని పదేపదే స్పష్టీకరించారు. వివిధ సమయాల్లో ఏర్పరచబడిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్, డి.ఎస్.కొఠారి కమిషన్ వంటి విద్యాకమిషన్లు కూడా మాతృభాషలోనే విద్య నేర్పించాలని ఘోషించాయి. మాతృభాషకు గల అనన్య సామాన్యమైన స్థానాన్ని గుర్తించిన కారణంగానే ఐక్యరాజ్యసమితి కూడా ఏటేటా ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది.
భారతదేశ సమగ్రాభివృద్ధి, జాతీయ సమైక్యత, స్వాభిమానాలను పెంపొందించడానికి విద్యాబోధనలో, దైనందిన వ్యవహారాలలో, ప్రభుత్వ వ్యవహారాలలో మాతృభాషకు గౌరవం లభింపచేస్తూ ప్రతిష్ఠితమొనరించేందుకు ప్రభావవంతమైన పాత్ర పోషించవలసిందిగా అఖిల భారత ప్రతినిధి సభ స్వయంసేవకులతో సహా, మన దేశీయులందరికీ పిలుపునిస్తున్నది. ఈ విషయంలో కుటుంబం వహించగల భూమిక అత్యంత కీలకమైనది. తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించే సందర్భంలో ప్రాథమిక విద్య మాతృభాషా మాధ్యమంలోనే ఉండాలనే పట్టుదలతో వ్యవహరించాలి.
కేంద్రప్రభుత్వము, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇప్పటి భాషా సంబంధమైన విధానాన్ని పున:పరిశీలించుకొని ప్రాథమిక విద్య మాతృభాషలో లేదా భారత రాజ్యాంగ సంవిధానంలో స్వీకరించిన ప్రాంతీయ భాషలో అందించడానికి కచ్చితమైన ఏర్పాట్లు చేయవలెనని, అదే సమయంలో ప్రశాసన వ్యవస్థలోనూ, న్యాయవ్యవస్థలోనూ నిర్వహణను భారతీయ భాషల ద్వారా సాగించేవిధంగా చర్యలు చేపట్టవలెనని అఖిల భారతీయ ప్రతినిధి సభ పిలుపునిస్తున్నది.