ఆవేశమే తప్ప ఆలోచన లేని ముస్లిం పర్సనల్ లా బోర్డుఢిల్లీలోని ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకులు మార్చి 21-22 తేదీలలో హడావిడిగా సమావేశమయ్యారు. తమకన్యాయం జరిగిపోతున్నట్లు ఆక్రోశించారు. హిందువులు ముస్లింలను హిందూధర్మంలోకి మార్చడం పట్ల ఆవేశపడ్డారు. మోదీని ప్రజలు అభివృద్ధి కోసం ఎన్నుకొంటే అసలు గత 10 నెలల్లో అభివృద్ధి జరగలేదని వారి సభ్యుడు కమాల్ ఫరూకి విమర్శించారు. ఆర్.యస్.యస్. వంటి సంస్థలు ప్రభుత్వ దిశను మార్చాయన్నారు.
నిజానికి 'ఘర్ వాపసి' (పునరాగమనం) వంటి కార్యక్రమాలు మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రారంభమైనవి కావని వారికి తెలియదా? స్వాతంత్ర్యోద్యమ సమయంలో హిందూజనసంఖ్యను రక్షించుకోవడానికి స్వామి శ్రద్ధానంద వంటివారు 'శుద్ధి' ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 1983లో తమిళనాడులో మీనాక్షిపురంలో పెద్దెత్తున హరిజనులు, అట్టడుగు వర్గాలకు చెందిన హిందువులను ముస్లింలు ఇస్లాంలోకి మతంమార్చినపుడు హిందూసమాజం పెద్ద ఎత్తున స్పందించింది. స్వామీజీలు 'స్వస్థానమాగచ్ఛయేత్' అన్నారు. 'నహిందు: పతితో భవేత్' (హిందువెపుడూ పతితుడు కాడు) అని నినదించారు. ప్రలోభాలకు లోనై తప్పుదారి పట్టి మతంమారిన హిందువులను తిరిగి హిందూధర్మంలోకి తీసుకొని వచ్చే కార్యక్రమం దశాబ్దాలుగా జరుగుతోంది. దీనికి ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధం లేదు.
'లవ్ జిహాద్'ను గురించి కూడా ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యాఖ్యానిస్తూ 'ఇది అనవసర వివాద'మన్నది. 'లవ్ జిహాద్' పేరున ఎందరు హిందూ బాలికలు అన్యాయమైపోయారో గణాంకాలు తెలియచేస్తున్నాయి. 2014 ఎన్నికల ముందు ఈ విషయమై పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. 83 శాతం మంది హిందువులెంతో కాలంగా సోదర మైనారిటీ వర్గాలతో కలిసిమెలిసి జీవించి యుండకపోయుంటే ఎంతో అనర్థం జరిగిఉండేది. హిందువుల విశాల భావన వారి బలహీనతగా భావిస్తున్న మైనార్టీలు అంతర్జాతీయ కుట్రలో భాగంగా అనేక అకృత్యాలకు పాల్పడుతున్నారు. దీన్ని ప్రశ్నిస్తుంటే తమకన్యాయం జరుగుతోందంటున్నారు.
ముస్లింలు తమకు సమస్యలుంటే సావధానంగా ప్రభుత్వం వద్ద ప్రస్తావించవచ్చు. కాని వారి కల్లబొల్లి కబుర్లు విని సంతుష్టీకరణకు పాల్పడే గంగిరెద్దు ప్రభుత్వం కేంద్రంలో ప్రస్తుతం లేకపోవడంతో వారి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లైంది. 'మతం మార్పిడుల'ను పూర్తిగా నిషేధించేందుకు వారు చిత్తశుద్ధితో ముందుకు వస్తారా? రాయిటర్స్ ప్రతినిధి సెప్టెంబరులో ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేస్తూ అడిగిన ప్రశ్నకు మోదీ బదులిస్తూ, .ఎస్..ఎస్. సంగీతానికి తగ్గట్లుగా భారతీయ ముస్లింలు నాట్యం చెయ్యరని, వారు 'దేశభక్తుల'నీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని విశ్వాసాన్ని భారతీయ ముస్లింలు నిలబెట్టుకోవాలి. ఆయన ఎన్నికల ముందు ప్రశ్నించినట్లుగా వారు తమ బీదరికంతో పోరాడాలి, హిందువులతో కాదు.
బిజెపి ప్రభుత్వాలు హిందూబోధనలను ముస్లింలపై రుద్దుతున్నాయని ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు ఖలీద్ రషీద్ ఫారంగి మహ్లి అన్నారు. యోగ, సూర్యనమస్కారాల విషయమై వారు ప్రశ్నించారు. యోగ, సూర్యనమస్కారాలు శారీరిక, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు. శరీరం, మనస్సు అనేవి ఒక్కొక్క మతంలో ఒక్కొక్కరకంగా ఉండవు. సూర్యుడు అన్నిమతాల వారికి వెలుగును ప్రసాదిస్తాడు. కేవలం హిందువులకే కాదు, హిందువులు ఏం చేసినా 'సర్వే జనా: సుఖినోభవంతు' అనే ఆలోచనతోనే చేస్తారు. అందుకే యోగ, సూర్యనమస్కారాలు సర్వమానవాళికి స్వాంతనను కలిగించేవి. అందుకే ఐక్యరాజ్యసమితిలో మోదీ చేసిన అభ్యర్థన మేరకు అంతర్జాతీయ యోగదినోత్సవంగా జూన్ 21ని నిర్ణయించారు. భారతీయ ధార్మిక ఛత్రఛాయలోకి ప్రపంచ ప్రజలందరినీ ఆహ్వానించే ఓ పవిత్ర ప్రయత్నమిది.