సాహసమే నా ఊపిరి


యువతీ మేుకో...
 ఝాన్సీరాణి, దుర్గావతి, చెన్నమ్మ, రాణి అహల్యబాయి ఇలా ఎందరో ధీశాలురు మన దేశంలో జన్మించారు. మహిళ అంటే కేవలం స్వాతికతకే  కాదు, ధైర్యానికి, సాహసానికి కూడా ప్రతిరూపం అని తమ మాటల ద్వారా, చేతలద్వారా ఆచరించి చూపారు.. రణ చండికలుగా రణరంగంలో శత్రువును దనుమాడారు. వారు రగిలించిన స్ఫూర్తి మహిళందరికీ ఆదర్శనీయమే.. అలాంటి వారినే ఆదర్శంగా తీసుకుంది కాబోలు అర్చనా సర్దానా.. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా స్కై డైవింగ్, స్కూబా డైవింగ్, అతి ఎత్తయిన శిఖరా అధిరోహణ, బేన్ జంప్ ఇలా ఇంతవరకూ మహిళలు ఎవరూ చేయని సాహసాలను ఆమె సునాయాసంగా చేసేస్తుంది.
పెళ్ళి తర్వాత కుటుంబ బాధ్యతలకే సమయం సరిపోదు, పైగా ఇద్దరు పిల్లలకు తల్లిగా బాధ్యతలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు వేరే పనులకు సమయం కేటాయించడం అసలే కుదరదు. అలాంటి మహిళ తనొక సాహస నారి అవుతానని అసలు ఊహించలేదు. భర్తతో కలిసి డార్జిలింగ్లో చేసిన ఫన్వాక్ ఆమె జీవితాన్నే ములుపుతిప్పింది. అలా డార్జిలింగ్ వెళ్లిన ఆమె హిమాలయన్ మౌంటెరింగ్ సంస్థలో మౌంటనీర్ కోర్సులో ప్రవేశం పొందింది. తర్వాత చేసిన 200 అసాధారణ జంప్సతో ప్రపంచ ప్రసిద్ధ సాహస మహిళగా పేరు తెచ్చుకుంది. దాన్ని అక్కడితో ఆపకుండా అతి ప్రమాదకరమైన బేన్ జంప్ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. అనుభవం ఉన్న వారుసైతం బేన్ జంప్ చేయడానికి సాహసించరు. అలాంటిది ఆమె 400 అడుగుల ఎత్తులో ఉన్న ఉతా బ్రిడ్జ్ నుంచి జంప్ చేసి అందరిచేత ప్రశంసలు అందుకుంది.
దేశంలోనే తొలి మహిళా సివిలియన్ బేన్ జంపర్గా, బేన్ జంప్ ట్రయినర్గా పేరు సంపాదించింది అర్చన. 335 స్కైడైవింగ్స్తో పాటు ఎన్నో బేన్ జంప్స్ చేసి తన అరుదైన ప్రపంచ ప్రతిభను ప్రపంచానికి చాటింది. అండమాన్లోని నీల్ ద్వీపంలో సముద్రానికి 30 మీటర్ల లోతున భారత జాతీయ జెండాను పాతి, మన దేశ కీర్తిపతాకాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాపింపజేసి, దేశం  గర్వపడేలా  చేసింది అర్చనా సర్దానా. అలాంటి వీర వనితను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.