గ్రామ సమగ్ర వికాసం కోసం తపించిన కీ.శే. రామిరెడ్డిగారు: రామిరెడ్డిగారి స్మారకోపన్యాస కార్యక్రమంలో వక్తలు


కీ.శే.పట్లోళ్ల రామిరెడ్డిగారి స్మారకోపన్యాస కార్యక్రమం నారాయణగూడలోని కేశవ స్మారక విద్యాలయంలో జరిగింది. ముఖ్యఅతిథిగా జస్టిస్ రాములుగారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ పోషకాహార సంస్థ ఎం.డి. శ్రీ భాస్కరాచారిగారు ప్రసంగిస్తూ 'శ్రీ రామిరెడ్డిగారితో గడిచిన అనేక సంవత్సరాల పరిచయం ఉన్నది. వారితో అనేక విషయాలు చర్చించే వాడిని. ముఖ్యంగా ఆరోగ్యసంబంధమైన విషయాలు, వేదకాలం నుంచి మనదేశంలో జీవన విధానము, ఆరోగ్య నియమాలు పాటింపచేసేవి. దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయటం, సూర్యనమస్కారములు చేయడం మొదలైనవి చేసేవారు. తద్వారా ఆరోగ్యవంతంగా ఉండేవారు. ఆయు:ప్రమాణం కూడా ఎక్కువగా ఉండేది. ఈ రోజు ఆరోగ్య నియమాల ఉల్లంఘన ఎక్కువగా ఉన్నది. ఆనారోగ్యాలు పెరుగుతున్నాయి. ప్రజలు ఆరోగ్య నియమాలు పాటించడంలో శ్రద్ధ తీసుకొనేవిధంగా మనం ప్రయత్నం చేయాలి' అన్నారు.
సభాధ్యక్షులు జస్టిస్ రాములుగారు మాట్లాడుతూ -''చాలా రోజుల క్రితం నరేంద్రమోడి సంఘ ప్రచారకుల గురించి మాట్లాడుతూ 'ప్రచారకులకు దేశం ఒక్కటే కనబడుతుంది, ప్రచారకులు అనేక విషయాలు ఆలోచిస్తూంటారు. తపన చెందుతూ ఉంటారు' అన్నారు. శ్రీ రామిరెడ్డిగారు కూడా అట్లాగే ఉండేవారు'' అన్నారు.
సురుచి శిక్షాసంస్థకు చెందిన శ్రీరామ్ కుమార సింగ్ మాట్లాడుతూ "ఈ దేశం మనకు రెండు రకాలుగా కనబడుతుంది. 1) ఇండియా -పట్టణాలు, ధనవంతమైనది, 2) భారత్ -గ్రామీణం, పేదది. గ్రామీణ జీవితం సరిగాలేని కారణంగా జీవనోపాధికి గ్రామాల ప్రజలు పట్టణాలకు వలసలు రావటం విపరీతంగా పెరిగిపోయింది. వీనిలో మార్పు తీసుకురావాలి. మా సంస్థ దానికోసమే పనిచేస్తున్నది. శ్రీ రామిరెడ్డిగారు కూడా ఈ పనిని ప్రధానంగా చేసారు, చేయాలని సూచించేవారు" అని వివరించారు.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్రీ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ "శ్రీ రామిరెడ్డిగారు నియమాలను పాటించటంలో నిక్కచ్చిగా ఉండేవారు. అది వారికే సాధ్యమైంది. శ్రీ రామిరెడ్డిగారు ప్రచారక్ జీవితంలో సంఘటన దృష్ట్యా సగభాగం పట్టణాలు, నగరాలు ఎక్కువ తిరిగారు. గ్రామీణ వికాసము, సేవాభారతి పని దృష్ట్యా మిగతా సగభాగము గ్రామాలలో తిరిగారు. గ్రామాలు వికాసం చెందాలని తపన చెందారు. సంఘంలో ఏ బాధ్యత ఇచ్చినప్పటికీ ఆ బాధ్యతకు పూర్తి న్యాయం చేకూర్చేవారు. సొంత విషయాలలో కఠోరంగా ఉండేవారు. అందరికి ఆదర్శప్రాయులు రాంరెడ్డిగారు" అని కొనియాడారు.
శ్రీ నవీన్ ఝాగారు కర్ణాటక హుబ్లీకి చెందిన ఒక ఎన్.జి.. నడిపిస్తున్నారు. పనిలో నైపుణ్యతను (స్కిల్స్ డెవలప్ మెంట్) పెంచేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే నైపుణ్య (స్కిల్స్) సంస్థ వాళ్ళది. వారు మాట్లాడుతూ -"ఈ రోజున స్కిల్స్ ఉన్న వర్కర్స్ ను నిర్మాణం చేయటం అత్యవసరమైన పని. సమగ్ర వికాసం కోసం నైపుణ్యంతో పనిచేయాలని శ్రీ రామిరెడ్డిగారు కోరుకొనేవారు" అని అన్నారు.
కార్యక్రమంలో రామిరెడ్డిగారి అన్నయ్య శ్రీ రఘుపతిరెడ్డిగారు, వారి కుమార్తె శ్రీమతి మాధవి కూడా మాట్లాడారు. చివరగా శ్రీ రామచంద్రయ్య గారు (వనవాసీ కళ్యాణ క్షేత్రం) మాట్లాడుతూ -"మనకు కింగ్స్ చాలామంది దొరుకుతారు, కాని కింగ్ మేకర్స్ కావాలి. అటువంటి వ్యక్తులను తయారు చేయటంలో రామిరెడ్డిగారు సిద్ధహస్తులు. గ్రామాల సమగ్ర వికసం కోసం తన జీవితాన్ని అర్పణ చేసినవారు రామిరెడ్డిగారు" అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ప్రాంత సంఘచాలకులు శ్రీ ప్యాట వెంకటేశ్వరరావు, జ్యేష్ట ప్రచారక్ శ్రీ హల్దేకర్ జీ పాల్గొన్నారు. శ్రీ ఆకుతోట రామారావు వందన సమర్పణతో కార్యక్రమం పూర్తయింది. అంతకుముందు రామిరెడ్డిగారిపై రచించబడిన ఒక పుస్తకాన్ని ప్రాంత సంఘచాలక్ మా.శ్రీ ప్యాట వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు.
- సమాచార భారతి