అంతర్జాతీయ యోగ దినోత్సవమునకు స్వాగతం


ఆర్.ఎస్.ఎస్. అఖిల భారత ప్రతినిధి సభ తీర్మానం-1
ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగదినోత్సవంగా పరిగణించాలంటూ ఐక్యరాజ్యసమితి 69వ సాధారణ మహాసభ ద్వారా వెలువడిన ప్రకటన భారతీయులందరికీ, వివిధ దేశాలలో ఉన్న భారతీయ మూలాలు కలిగిన వారికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది యోగ సాధకులకూ ఎంతో హర్షాన్ని, గర్వాన్ని కలిగించింది. భారతదేశపు గౌరవనీయ ప్రధానమంత్రి 2014 సెప్టెంబరు 27న ఐక్యరాజ్యసమితి సాధారణ మహాసభలో ప్రసంగిస్తూ, అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలంటూ చేసిన ప్రతిపాదనకు అపూర్వమైన రీతిలో స్పందన లభించడం కూడా మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నది. భారతదేశపు గౌరవనీయ ప్రధానమంత్రి 2014 సెప్టెంబరు 27న ఐక్యరాజ్యసమితి సాధారణ మహాసభలో ప్రసంగించుతూ అంతర్జాతీయ యోగదినోత్సవాన్ని నిర్వహించుకోవాలంటూ చేసిన ప్రతిపాదనకు అపూర్వమైన రీతిలో స్పందన లభించటం కూడా మనకు ఎంతో ఆనందాన్ని కల్గిస్తున్నది. భారతదేశపు ప్రతిపాదనను నేపాల్ వెంటనే స్వాగతించింది. 175 దేశాలవారు ఈ తీర్మానాన్ని సమర్థిస్తూ, సహప్రతిపాదకులుగా ముందుకు రావటంతో కేవలం మూడుమాసాల వ్యవధిలోనే 2014 డిసెంబరు 11న ఏ విధమైన ఓటింగ్ లేకుండా సర్వసమ్మతితో ఆమోదింపబడింది.
ప్రపంచానికి భారతీయ నాగరికత అందజేసిన ఒక అద్భుతమైన కానుక 'యోగ' - అనే వాస్తవాన్ని అఖిల భారతీయ ప్రతినిధి సభ అందరి దృష్టికీ తీసికొనిరాగోరుతున్నది. 'యుజ్' అనే ధాతువు నుండి రూపుదిద్దుకొనిన యోగ శబ్దానికి 'కలయిక', 'సమాధి' అని అర్థాలున్నవి. యోగ అనేది కేవలం శరీర వ్యాయామానికి పరిమితమైనది కాదు. శరీరాన్ని, మనస్సును, బుద్ధిని, ఆత్మనూ సమన్వయించుకొనే సమగ్ర జీవన పద్ధతియని పతంజలి వంటి మహర్షులు వివరించినారు. 'యోగ: చిత్తవృత్తి నిరోధ:, మన:ప్రశమనోపాయ: యోగ:, సమత్వం యోగ ఉచ్యతే' వంటి శబ్దాలలో యోగకు వివరణ ఇవ్వబడింది. దీనిని గ్రహించుకొని ఆచరించే వ్యక్తి ప్రశాంతమైన, రోగరహితమైన జీవితాన్ని గడపగల్గుతాడు. యోగమార్గాన్ని అనుసరించుతూ, సంతులితమూ, ప్రకృతితో సుసంగతి సాధించినదీ అయిన జీవితాన్ని గడుపుటకు ప్రయత్నిస్తున్న వారిసంఖ్య దినదినాభివృద్ధి గాంచుతున్నది. ఇలా అభ్యసించుతూ ఉన్నవారిలో వివిధ దేశాలకు, వివిధ సంస్కృతులకు చెందిన సాధారణ వ్యక్తుల నుండి ఎందరో ప్రముఖులు, ప్రసిద్ధులు, పారిశ్రామికవేత్తలు, రాజనీతివేత్తలు తదితరులు కూడా ఉన్నారు. యోగ విశ్వవ్యాప్తం కావటంలో అనేకమంది సంతులు, యోగాచార్యులు, యోగప్రశిక్షకులు ప్రయాస చేసియున్నారు. అటువంటి మహానుభావులందరికీ అఖిల భారతీయ ప్రతినిధి సభ కృతజ్ఞతలు తెలియచేస్తున్నది. ప్రపంచంలోని మూలమూలలకూ యోగభ్యాసాన్ని గురించిన సందేశాన్ని తీసికొనిపోవటం యోగ ప్రేమికులైన ప్రజానీకం యొక్క కర్తవ్యం.
చారిత్రకమైన ఈ తీర్మానాన్ని ఆమోదింపచేయటంలో సహకరించిన భారతీయ దౌత్యవేత్తలను, వివిధ దేశాల ప్రతినిధులను, తీర్మానాన్ని సమర్థించిన ఐక్యరాజ్యసమితి అధికారులను, సంబంధిత వ్యక్తులందరినీ అఖిల భారతీయ ప్రతినిధి సభ అభినందించుతున్నది. యోగదినోత్సవాన్ని జరపటం ద్వారా, యోగాధారిత ఏకాత్మ జీవనశైలిని అలవరచుకోవటం ద్వారా ఎల్లెడలా వాస్తవికమైన సోదరభావానికి, వైశ్వికమైన ఏకతా భావానికి అనుగుణమైన వాతావరణం నెలకొనగలదని అఖిల భారతీయ ప్రతినిధి సభ తన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నది.
ఇప్పటి ఈ చొరవను ఇకముందు కూడా కొనసాగించుతూ విద్యాప్రణాళికలో యోగాభ్యాసాన్ని భాగం చేయవలెనని, యోగలో పరిశోధనలను ప్రోత్సహించవలెనని, సమాజ జీవనంలో యోగను ప్రాచుర్యంలోకి తీసికొనవలెనని అఖిల భారతీయ ప్రతినిధి సభ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నది. యోగను వ్యాపింపచేయటం ద్వారా ఈ పృథ్విని సుఖసంతోషములకు, శాంతికి, ఆరోగ్యదాయకమైన, ప్రమాదరహితమైన మనుగడ కల్గిన స్థితికి నిలయంగా రూపొందించుటలో ముందుకు రావలసినదిగా ఈ ప్రతినిధి సభ స్వయంసేవకులతో సహా, దేశవాసులందరినీ, ప్రపంచంలోని భారతీయ మూలములు గల ప్రజానీకమును, యోగ ప్రేమికులనూ కోరుతున్నది.