మహిళను గౌరవిస్తేనే ప్రగతిమహిళలకు సమానావకాశాలు, హక్కులను కల్పించడంతో పాటు వారిపై అత్యాచారాలు, లైంగిక దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది. దేశంలో రోజూ ఏదో ఒక ప్రాంతంలో ఆడవారిపై అత్యాచారాలు, హత్యలు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఇవి మన సంస్కృతీ, సంప్రదాయాలకు మచ్చలను తెస్తున్నాయి. అలాగే వరకట్న దురాచారాలు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగోర్ మహిళల గురించి ప్రస్తావిస్తూ ఇల్లాలే ఇంటికి వెలుగు, ఇల్లాలే జీవన జ్యోతి అని అభివర్ణించారు. మన సమాజంలో తరతరాలుగా స్త్రీకి ఎంతో సమున్నతమైన గౌరవం ఉంది. దానిని కాపాడుకోవాలి. మహిళల పట్ల తల్లిదండ్రులు, అధ్యాపకులు, నాయకుల దృక్పథంలో మార్పు రావాలి. మహిళలను గౌరవించిన సమాజమే అభ్యున్నతిని సాధిస్తుంది. యత్ర నార్యస్తు పూజ్య యంతే, రమంతే తత్ర దేవతా అనే ఆర్యోక్తి చెబుతున్నదీ అదే. పిల్లలకు మంచి నడవడిక, సత్ప్రవర్తన, మంచి అలవాట్లు అబ్బేట్టు చూడటంలో మనం విఫమవుతున్నాం. వారికి స్వేచ్ఛ ఇవ్వడం ఎంత అవసరమో, వారి నడవడిక సక్రమంగా ఉందో లేదో ఎప్పటికప్పుడు కనిపెట్టి చూడటం కూడా అంతే అవసరం. ప్రతిపౌరుడూ మహిళ పట్ల గౌరవంతో, వినమ్ర భావంతో మెలిగేట్టు చూడాలి. మహిళలపై దాడులను అరికట్టలేకపోతే న్యాయం జరిగినట్టు కాదు. స్త్రీని గౌరవించినప్పుడే జాతి పరిఢవిలుతుంది.
- ప్రణబ్ ముఖర్జీ, రాష్ట్రపతి