మే 19వ తేది నాడు వెలువడిన ఐదు
రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ దేశం యొక్క రాజకీయ ముఖచిత్రాన్ని వెల్లడించింది. ఈ
ఎన్నికలో కాంగ్రెస్ తమ ప్రాబల్యాన్ని ఎట్లా కోల్పోతున్నదో మొదటగా పేర్కొనదగిన
విషయం. కాంగ్రెస్ ముక్త భారత్ అనేది అసాధ్యమేమి కాదు అని ఈ ఎన్నిక ఫలితాలు మరోసారి
నిరూపించాయి. ఈ ఎన్నికల ఫలితాలను గమనించినట్లైతే
తమిళనాడు రాష్ట్రంలో జాతీయ పార్టీలు తమ ప్రాభవాన్ని ఇప్పటికి
నిలబెట్టుకోలేకపోతున్నాయి. గడిచిన దశాబ్దా కాలంగా తమిళనాడులో
ద్రవిడ పార్టీల ప్రాబల్యం పెరిగి జాతీయ పార్టీలు నామమాత్రంగా
మిగిలిపోయాయి. జాతీయ దృష్టికోణంలో ఇది ఆలోచించవలసిన విషయం.
బెంగాల్లో కూడా కాంగ్రెస్ నుంచి విడిపోయిన మమతా బెనర్జీ రెండవసారి అధికారంలోకి
వచ్చింది. కేరళలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది. అనూహ్యంగా అస్సాంలో
బీజెపి అధికారంలోకి వచ్చింది. బెంగాల్లో, కేరళలో కమ్యూనిస్టులు తమ
ప్రాబల్యాన్ని నిలబెట్టుకునేందుకు చాలా ప్రయత్నం
చేశారు. కాని బెంగాల్లో సాధించలేకపోయారు. కేరళలో ప్రభుత్వం ఏర్పాటు
చేసుకోగలిగారు.
తమ ప్రత్యర్థుపై భౌతిక
దాడులు చేయటం అనేది కమ్యూనిస్టు పార్టీ స్వభావం. మారుతున్న కాలమాన
పరిస్థితుల్లో కూడా కాలదోషం పట్టిన ఇటువంటి
భౌతిక దాడులను కమ్యూనిస్టులు వదుకోలేకపోతున్నారు.
దీనికి తాజా ఉదాహరణ కేరళలో బీజెపి తన ప్రాభల్యాన్ని పెంచుకుంటూ అనేక చోట్ల రెండో
స్థానంలో నిలబడింది. దీనిని తట్టుకోలేక కేరళలలో బీజెపి
కార్యకర్తలపైన ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది సమయంలోనే
దాడులు చేసి భీభత్సం సృష్టించింది. ఇటువంటి
హింసా ధోరణి కలిగిన పార్టీలకు ప్రజలే బుద్ధి
చెప్పాల్సిన అవసరం ఉంది. దేశంలో తమ ప్రాబల్యాన్ని కోల్పోతూ కూడా ఇటువంటి విధ్వంసకర
దాడులు చేయటం ఏమి సూచిస్తుంది?
దాడులకు దాడులే
సమాధానంగా ఎదుటివారు కూడా అటువంటి విధానాన్నే అనుసరిస్తే పరిస్థితులు ఎట్లా ఉంటాయో
కమ్యూనిస్టులు గ్రహించాల్సిన అవసరం ఉంది. తమ శక్తి సామర్థ్యాల తో ఎవరైనా గెలుపొందొచ్చు. హింసా
రాజకీయాలతో రాజకీయం చేయటం అనే విధానాన్ని కమ్యూనిస్టు పార్టీ ఇప్పటికైనా వదులుకుంటే వాళ్ళకు, దేశానికి మంచిది. లేకున్నట్లయితే సమీప భవిష్యత్తులో కాలగర్భంలో
కలిసిపోవాల్సిన పరిస్థితులు తమంతట తాము నిర్మాణం
చేసుకున్న వాళ్లుగా చరిత్రలో వాళ్ళు
మిగిలిపోతారు. ఈ ఎన్నికల సందర్భంగా పత్రికలను ఒక విషయంలో
మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అస్సాం
మినహాయించి మిగతా చోట్లా ఎక్కడా కూడా తగినన్ని సీట్లు పొందలేకపోయినా బీజెపిని
విమర్శించకుండా ఆయా రాష్ట్రాలో బీజెపి ఓటు శాతం ఎట్లా పెరిగిందో వివరించడం ఈ సారి
మనం గమనించవచ్చు.