ప్రజలు-ప్రభుత్వం సమన్వయంతోనే సమస్యలకు పరిష్కారంఅక్టోబర్‌ 11 మంగళవారం నాడు విజయ దశమి పండుగ రోజున నాగపూర్‌లోని రేషన్‌బాగ్‌ మైదానంలో జరిగిన విజయదశమి ఉత్సవంలో ప.పూ. సర్‌ సంఘచాలక్‌ మా. మోహన్‌ భాగవత్‌ జీ దేశ ప్రజలందరినీ ఉద్దేశించి ప్రసంగించిన ప్రసంగంలో కొన్ని ముఖ్య అంశాలు గమనిద్దాం.

గత సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న దీనదయాళ్‌ ఉపాధ్యాయ శతజయంతి ఉత్సవ కార్యక్రమాలు ఎంతో ప్రేరణదాయకంగా ఉన్నాయి. అట్లాగే ఆచార్య అభినవ గుప్త, శ్రీభాష్య వ్యాఖ్యాత శ్రీ రామానుజచార్యులు విరిరువురి జన్మ సహస్రాబ్ది ఉత్సావాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆచార్య అభినవ గుప్త ఆత్మ సాక్షాత్కారం పొందిన తపస్సంపన్నులు. భగవంతుని సాక్షాత్కారానికి ధ్వని (శబ్ద స్వరూపం) ఎట్లా దారి చూపుతుందనే విషయాన్ని కూడా ఆచార్య అభినవ గుప్త వివరించారు. అది ఆధునిక కంప్యూటర్‌ నిపుణులకు లోతైన పరిశోధనకు ఒక ప్రముఖ అంశమైనది. అన్నిటికంటే మించి సనాతన ధర్మ సంస్కృతుల స్వరూప స్వభావాలు కాశ్మీర్‌లో ఎట్లా ఉన్నాయో వివరించిన వారు ఆచార్య అభినవ గుప్త. అట్లాగే రామానుజచార్యుల వారు కుల మత విభేదాలను తోసిపుచ్చి ప్రజలందరికి భక్తి, జ్ఞాన మార్గాలను అందించిన ఒక సామాజిక ఆర్ధ్రత కలిగిన మహానుభావులు. మొగలులతో పోరాటం చేసిన శ్రీ గురు గోవింద్‌సింగ్‌ 350వ ఉత్సవాలు దేశమంతటా జరుపుకుంటున్నారు. ఈ విధంగా దేశంలో జన్మించిన అనేక మంది మహాపురుషులు, వారి జీవితాల ద్వారా వారు ఈ సమాజానికి ఏ రకంగా సేవ చేశారో వారి జీవితాల ద్వారా మనకు చూపించారు. వారందరిని జ్ఞాపకం చేసుకోవడం, అనుసరించడం మనందరి కర్తవ్యం. గడిచిన సంవత్సర కాలంగా ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలు దేశ ప్రజలలో ఉత్సాహపూరిత వాతవారణాన్ని నిర్మాణం చేస్తున్నాయి. ప్రభుత్వాలు చేసే తప్పిదాలపైనే దృష్టి పెట్టి పాలనాపరమైన లోపాలను ఎత్తి చూపాలని కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులు ప్రయాత్నం చేస్తున్నారు. ఈ రెండింటి మధ్య జరుగుతన్న సంఘర్షణ దేశ ప్రజలకు ఎంతో ఆందోళన కలిగిస్తున్నది. ప్రపంచంలో పెరుగుతున్న అతివాద, పిడివాద, వేర్పాటువాదుల శక్తుల హత్యాకాండ ఎంతో ఆందోళన కల్గిస్తున్నది. మన హిందూ సమాజంలో భేద భావాలు పూర్తిగా తొలగిపోని కారణంగా దేశంలో జరుగుతున్న కొన్ని అవాంఛిత, యాధృచ్చిక సంఘటనలను చిలువలు పలువలుగా వర్ణిస్తూ ప్రజలలో గందరగోళ వాతావరణాన్ని నిర్మాణం చేయాటానికి కొన్ని శక్తులు అదే పనిగా పనిచేస్తున్నాయి. ఈ శక్తులపట్ల స్వయంసేవకులు, దేశప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మోహన్‌జీ పిలుపునిచ్చారు. దేశంలో నెలకొన్న సామాజిక పరిస్థితులలో మార్పులు తీసుకొని వచ్చేందుకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యకర్తలు ఎంతో విశేషంగా కృషి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కొన్ని వేల గ్రామలలో సామాజిక స్థితిగతులపై (ఉదా. 1. మంచి నీరు అందరికీ సమానంగా అందిచడం, 2. దేవాలయంలో అందరికీ ప్రవేశం కల్గించడం, 3. అందరికీ ఒకే శ్మశాన వాటిక ఉండడం మొదలైన అంశాలపై) సర్వేక్షణ చేశారు. దానిలో 40 శాతం గ్రామాలలో ఆలయ ప్రవేశ విషయంలో, 30శాతం గ్రామాలలో నీటిని ఉపయోగించుకోవడంలో 35శాతం శ్మశాన వాటిక విషయంలో వివక్షత కొనసాగుతున్నదని సర్వేక్షణ నివేదిక మనకు అర్థం చేయిస్తున్నది. షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ తెగలవారికి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు, ప్రయోజనాలు ఆ తెగల వారికి వివరించి వాటిని సాధించుకునేందుకు స్వయంసేవకులు వారికి ఎంతో సహకరిస్తున్నారు. ఈ 21వ శతాబ్దంలో కూడా తమ ఆధిపత్యం కోసం అనేక విఘటన శక్తులు భౌతికదాడులు కూడా చేస్తున్నాయి. ఈ శక్తులను ప్రభుత్వం నియంత్రించాలి. భారత రాజ్యాంగంలో గో జాతుల సంరక్షణకు అనేక ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకొని అనేకమంది సాధుసంతులు, స్వయంసేవకులు గో జాతి సంరక్షణకు ఎంతో కృషి చేస్తున్నారు. గో హత్యా నిషేద చట్టాన్ని అమలు చేయటంలో ఒక వివక్షత కనపడుతోంది. ఈ సందర్భంగా దేశంలో జరుగుతున్న చెదురు మదురు సంఘటనల ఆధారంగా దేశప్రజలను తప్పుదారి పట్టించి తమ స్వార్థ ప్రయోజనాలను సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్న శక్తులపట్ల ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు.

జమ్మూ కాశ్మీర్‌ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు ఎంతో ఆందళనకు గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితులు చక్కదిద్దడం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఆశాజనకంగా ఉన్నప్పటికీ పరిస్థితులు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. కశ్మీర్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం కాని రాష్ట్ర ప్రభుత్వం కాని ఎటువంటి మొహమాటానికి లోనుకాకుండా కఠినంగా వ్యవహరించాలి. గిల్గిట్‌, బల్టిస్తాన్‌, ముజ్‌ఫరాబాద్‌, మీజ్‌పూర్‌తో సహా మొత్తం కశ్మీర్‌ భారతదేశంలో ఒక అవిభాజ్య అంగమని స్పష్టం చేయాడానికి కృతనిశ్చయంతో ఉండాలి. పాకిస్తాన్‌ నుంచి వలస వస్తున్న మన హిందూ సోదరులను జమ్మూ కశ్మీర్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసు కునేందుకు అవకాశం కల్పించాలి. యురీ సైనిక శిబిరంపై జరిగిన దాడిని నిర్లక్ష్యంగా భావించ కుండా సైనిక బలగాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైన వుంది. దేశ సౌరభౌమత్వాన్ని కాపాడుకునేందుకు పాలనా యంత్రాగం, ప్రజలు పరస్పర సహకారంతో పనిచేస్తూ జాతి వ్యతిరేక శక్తుల ఆట కట్టించాలి. వేల సంవత్సరాల నుంచి ఈ దేశం 'ఒకే దేశం ఒకే ప్రజ'గా ఉంది. దానిని బలహీనం చేసేందుకు ప్రయత్నిస్తున్న వేర్పాటువాద శక్తులపట్ల దేశ ప్రజలు జాగృతంగా ఉండాలి. వ్యక్తులలో దేశం ఎడల తమ బాధ్యతను గుర్తింప చేసే జాతీయ, సామాజిక, సాంస్కృతిక విలువలను సరైన పద్ధతిలో అందించటమే విద్యా వ్యవస్థ యొక్క ఉన్నత లక్ష్యం. విద్య అనేది వ్యక్తికి జీవనోపాధి అందించడంతో పాటు అతనికి ఆత్మవిశ్వాసాన్ని, స్వాభిమానాన్ని స్వావలంబనను కూడా కలిగించాలి. వ్యక్తి జ్ఞానాన్ని సముపార్జించడంతోపాటు దేశం ఎడల బాధ్యత, సమాజంపట్ల స్నేహభావం ఆధారంగా జీవితాన్ని గడపాలి. ఈ అవసరాలను తీర్చేవిధంగా మన విద్యా ప్రణాళిక ఉండాలి. పాఠశాలల్లో, కాలేజీలలో సరైన విద్యతోపాటు మన సంస్కృతిని, పండుగలను, కుటుంబ సంబంధాలను అర్థం చేయిస్తూ ఈ తరాలకు అర్థం చేయించాల్సిన అవరసం ఉంది. ఈ దిశలో అనేకమంది అనేక రకలుగా ప్రయత్నం చేస్తున్నారు. సంఘంలో కూడా కుటుంబ ప్రబోదన్‌ సంస్థ ద్వార విశేష ప్రయత్నం జరుగుతున్నది. దేశంలో వృక్ష సంపదను పెంచటానికి స్వచ్ఛ భారత్‌, ఆరోగ్య భారత్‌లను సాధించేందుకు ప్రయత్నిస్తున్న వివిధ సామాజిక ఉద్యమకారులు, సంఘ స్వయంసేవకులు ఇంకా ఎంతో చొరవ తీసుకుని పని చేయాల్సిన అవసరం ఉంది.

మన సమాజానికి వైవిధ్యంతో, వివిధత్వంతో ఎలా వ్యవహరించాలో బాగా తెలుసు. దేశంలో కనిపించే వైవిధ్యం వెనుక శాశ్వతమైన ఏకత్వం ఎలా ఉన్నదో మన పూర్వీకులు బాగా గుర్తించారు. ఈ సత్యాన్ని ప్రపంచానికి నేర్పడం కోసమే మన దేశం పుట్టింది. ఆ కార్యాన్ని నిర్వర్తించడం కోసమే ఈ దేశం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. అది ఈ దేశం యొక్క సహజ లక్షణం. ప్రపంచానికి ఈ సందేశం ఎప్పుడూ వినిపిస్తూనే ఉండాలి. కాబట్టి ఈ దేశం సృష్టి అంతమయ్యే వరకూ ఉంటుంది. అందుకనే మన దేశం 'అమరమైనది' (చావు లేనిది). భౌతికవాదం, స్వయంగా సృష్టించుకున్న వైరుధ్యాల మధ్య చిక్కుకున్న ప్రపంచానికి మరోసారి సత్యాన్ని బోధించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ విధంగా ప్రపంచానికి సందేశాన్ని వినిపించడం కోసం మనం మరోసారి సన్నద్ధులం కావాలి. తద్వారా మన జాతి అస్తిత్వానికి గల ప్రయోజనాన్ని, తర్కాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ సృష్టిలో ఏకత్వాన్ని దర్శించిన సనాతన ధర్మం, సంస్కృతులను అధ్యయనం చేసి, అర్థం చేసుకుని వాటిని దేశ, కాల, మాన పరిస్థితులకు అనుగుణంగా నిర్వచించుకుని ప్రపంచం ముందు పెట్టాలి. మన అద్భుతమైన శోషణకు తావులేని, సంపూర్ణ జాతీయ జీవనాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి. శతాబ్దాల బానిసత్వం, ఆత్మ విస్మృతివల్ల కలిగిన దుష్ప్రభావాలను తొలగించుకునేవిధంగా మన జాతీయ విధానాన్ని ప్రాచీన, సాంప్రదాయబద్ధమైన మేధస్సు ఆధారంగా రూపొందించుకోవాలి. దీనికోసం మన మనస్సుల్లో ఉన్నతమైన శాశ్వత విలువలు, ఆదర్శాలు, సంస్కృతిని నింపుకోవాలి. మనం ఆత్మవిశ్వాసంతో, ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు చక్కని పరిష్కారం అందించ గలిగిన సామర్ధ్యం మనకు ఉందని ప్రపంచానికి తెలియచేయాలి. ఇదే గులాబ్‌రావ్‌ మహారాజ్‌ మనకు ఇచ్చిన సందేశం. ప్రభుత్వం ఈ దిశగా దృఢత్వంతో ముందుకు సాగాలి. పాలనా యంత్రాంగం ప్రభుత్వ విధానాలను పూర్తి సమర్థత, ఉత్సాహంతో అమలు చేయాలి. తద్వారా అట్టడుగున ఉన్న వ్యక్తికి కూడా ఆనందమయమైన, సుఖవంతమైన, సంతృప్తికరమైన జీవనం అందాలి. మరోవైపు ప్రజలు కూడా సామరస్యంతో, వ్యవస్థీకృతంగా, జాగరూకతతో మెలగాలి. ప్రభుత్వం, పాలనాయంత్రాంగానికి సహకరిస్తూ, అవసరమైనప్పుడు నియంత్రించగలగాలి. ఇలా ప్రజలు, ప్రభుత్వం, పాలనాయంత్రాంగం పరస్పర సమన్వయం, సహకారంతో ముందుకు సాగినప్పుడే ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తుల కుట్రల్ని భగ్నం చేసి విజయాన్ని సాధించగలుగుతాం.

ఈ కార్యం ఎంతో కఠినమైనది. కానీ మనకు మరో ప్రత్యామ్నాయం లేదు. కనుక దానిని నెరవేర్చవలసిందే. అకుంఠితమైన దీక్ష, సాహసం, సమర్పణభావం, నిస్వార్థత ఉంటే అసాధ్యమనుకున్న కార్యాల్ని కూడా సుసాధ్యం చేయవచ్చని శ్రీ గురుగోవింద్‌ సింగ్‌ మనకు ప్రత్యక్షంగా ఒక ఉదాహరణగా. కనపడతారు. ఈ ఆదర్శాన్ని మనం ఎంతో నిష్టతో సాకారం చేసుకోవాలి. దైవీయమైన గుణాలను కలిగించగలిగిన ప్రత్యక్ష ఉదాహరణలను సమాజం ముందు ఉంచాలన్న లక్ష్యంతో, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ పనిచేస్తోంది. నిస్వార్థ, స్వచ్ఛమైన ప్రేమభావన ద్వారా వ్యక్తుల్లో హిందూ రాష్ట్రాన్ని ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలపాలన్న సంకల్పాన్ని కలిగిస్తోంది. సులభమైన, సరళమైన శాఖా కార్యక్రమాల ద్వారా సాగే సాధన మన జీవితానికి అవసరమైన కార్యనిర్వహణ, నిస్వార్థ బుద్ధితో పనిచేసే ఆలోచనను కలిగిరచటమే ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం.

సమాజంలో వెంటనే మార్పు తెచ్చేందుకు ఉద్దేశించిన సమరసత, గోసంవర్థన, కుటుంబ ప్రబోధన్‌ మొదలైన కార్యక్రమాల గురించి నేను ఇంతకుముందే ప్రస్తావించాను. అయితే ఈ దిశలో మొత్తం సమాజమంతా క్రియాశీలంగా ముందుకు కదలాలి. తొమ్మిది రోజుల్లో ఏకీకృతమైన, సమీకృతమైన పవిత్ర, దైవీ శక్తి పదవ రోజున చండ, ముండ, మహిషాసుర వంటి రాక్షసుల్ని హతమార్చి మానవాళిని కాపాడింది. ఈ రోజు విజయదశమి. విజయోత్సవ పండుగ. మీ నుంచి సెలవు తీసుకునే ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ చేపట్టిన ఈ జాతీయ కార్యంలో మీ సహాయం, సహకారం, ప్రేమాభిమానాలను కోరుతూ, మీరు కూడా ఈ కార్యంలో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను.
ఈ ప్రార్థన ద్వారా మీకందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలుయజేస్తున్నాను.

ఓ పరమశివా ! నీ శుభాశీస్సులను నా పై కురిపించు
సత్కార్యాలు చేయడానికి నేను ఎప్పుడూ
వెనకడుగు వేయకుందునుగాక !
యుద్ధభూమిలో అడుగుపెట్టినప్పుడు
నాకు భయం లేకుండుగాక !
నేను ఎల్లప్పుడూ విజయకాంక్షతో నుందునుగాక !
స్వీయ బోధనగా ఎల్లప్పుడూ నేను నిన్ను
అనుసరింతును గాక
నా అంతిమకాలం సమీపించినప్పుడు,
నేను యుద్ధభూమిలో వీరమరణం పొందుదునుగాక !
|| భారత్‌మాతాకీ జయ్‌ ||