ఇటువంటి దసరా అన్ని ఊర్లలో జరిగితే ప్రజలు సామరస్యంగా జీవిస్తారుదసరా సంబరాలు దేశంలో ఊరూరా ఘనంగా ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్నాయి. ఈ ఊర్లో కూడా అదే. కాకపోతే ఊరి ప్రజలు అందరూ డప్పుల శబ్దాలు మ్రోగుతుంటే కలిసి నడుస్తారు. ఆడ-మగ, ధనిక-పేద, అని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీల నాయకులు అన్నీ మరిచిపోయి అందరూ వరుసలో నిలుచుని భారతమాత ప్రార్థన చేస్తారు (ఐర్లండ్‌కు చెందిన మార్గరేట్‌ ఎలిజబెత్‌ సోదరి నివేదిత చెప్పిన విధంగా భారతీయులు కలిసి దేశమాతను రోజూ ప్రార్థిస్తే, ఈ దేశం శక్తివంత మవుతుంది. ఒక వరుసలోనే కూర్చుని దసరా సందేశాన్ని శ్రద్ధగా వింటారు. పూజ తరువాత జమ్మి ఆకులు అందరికీ పంచుతారు. గత 15 సంవత్సరాలుగా ఈ పద్ధతి కొనసాగుతోంది. ఈ గ్రామం పేరు కొత్త గడి మల్కాపూర్‌. సంగారెడ్డికి 2 కి.మీ. దూరంలో ఉంది. మెదక్‌ జిల్లాలో ఉంది. ఈ గ్రామ హనుమాన్‌ గుడిలో ప్రతిరోజు భగవద్గీత చదువుతారు. ప్రతి శనివారం అన్ని కులాలవారు భజనలు చేస్తారు. సురేందర్‌ రెడ్డి కుటుంబం గ్రామ ప్రజల ఐక్యతకు అంకితం. ఈ ప్రేరణతో యువకులు, విద్యార్థులలో దేశభక్తి పొంగి పొరలుతుంది.
దసరా - దశకంఠ రావణుని సంహరించిన రోజు. దసరా పాండవులకు శక్తివంతమైన ఆయుధాలు జమ్మి (శమీ వృక్షం) చెట్టుపై దాచి, దసరా రోజున తీసి, పశువులను దొంగతనంగా తోలుకొని పోతున్న కౌరవులను గెలిచిన రోజు దసరా. అమ్మవారు, ఆదిశక్తిని 9 రోజులు ఉపాసన చేసి శక్తిని పొందే రోజు. అవన్నీ గుర్తుచేసుకుని ప్రేరణ పొందుతారు.

కమ్యూనిస్టులు - కంచ ఐలయ్య శిష్యులు, ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ మానస పుత్రిక స్వ్యారో సభ్యులు, సమాజ విధ్వంసక నక్సలైట్లు, సమతా సైనిక దళాలు ఇవన్నీ దేశంలో ఒక కులాన్ని మరో కులంపై దాడి జరిపే చర్యలను జరుపుతుంటారు. దసరా, దీపావళి, బతుకమ్మలు జరుపుకోవద్దని ఉద్యమిస్తున్నారు.

బుద్ధుని పేరుతో, అంబేద్కర్‌ పేరుతో ఎస్‌.సి.లను, నిమ్న వర్గాల ప్రజలను గందరగోళానికి గురిచేసి, అధికారం కోసం రాజకీయాలు నడుపుతూ, కుటుంబం, వివాహం, పండుగలు, దేశభక్తి, అన్ని వర్గాల ప్రజల సేవ ... ఇలా ఇవన్నీ కాలదన్నుతూ సమాజ విధ్వంసక రచనకు ఉపక్రమించారు.

ఇటువంటి వెన్నుపోటు, నమ్మకద్రోహుల గురించి డాక్టర్‌ అంబేద్కర్‌ 1949 నవంబర్‌ 26న రాజ్యాంగ సభలో ముందుగానే హెచ్చరించారు. మహ్మద్‌ బిన్‌ కాశిమ్‌తో, మహ్మద్‌ ఘోరీతో, అక్బర్‌తో, ఆంగ్లేయులతో మనం ఓడిపోవటానికి ప్రధానమైన కారణం ఈ దేశంలోని ద్రోహులే కారణమని చెబుతూ, మన స్వతంత్ర భారతాన్ని కాపాడుకోవాలని ఉద్భోదించారు. అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడుద్దాం. అన్ని వర్గాల ఆచారాలను గౌరవించి, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడు కుందాం. 

- శ్రీ అప్పల ప్రసాద్‌,
కన్వీనర్‌, తెలంగాణ సామాజిక సమరసతా