కాశ్మీర శైవతత్త్వ ప్రతిపాదకులు ఆచార్య ''అభినవగుప్త'' శివైక్య సహస్రాబ్ది సంవత్సరం

ఆచార్య అభినవగుప్త క్రీ.శ.950వ సం||లో నరసింహగుప్త, విమలకళ పుణ్యదంపతులకు కాశ్మీర్‌ ప్రాంతంలో జన్మించారు. వారి పూర్వీకులు ఆ ప్రాంతాన్ని ఏలిన లలితాదిత్యుని కాలంలో మధ్య భారతం లోని కనౌజ్‌ ప్రాంతం నుండి వలస వచ్చారు. అభినవగుప్తుడు జన్మించే నాటికి కాశ్మీరంలో ఆధ్యాత్మిక సాధన కొన్ని వర్గాలకు పరిమితమయి ఉండేది. వారు బాల్యం నుండి కఠోర సాధనచేసి, 30 సం||లు వివిధ ప్రాంతాలు పర్యటించి వివిధ సంప్ర దాయాలను అధ్యయనం చేశారు. సంగీతం, సాహిత్యము, తంత్ర శాస్త్రములలో ప్రావీణ్యం సంపాదించారు. ''తంత్రలోక'' అను గ్రంథాన్ని రచించారు. భరతముని నాట్య శాస్త్రానికి ''అభినవభారతి'' అను పేర వ్యాఖ్యానం రచించారు.


ఆ కాలంలో ఉన్న కుల, లింగ వివక్షతను తుత్తునియలు చేశారు. కఠిన నియమాలతో కొద్దిమందికే అందుబాటులో ఉండే పద్ధతులకు స్వస్తి పలికారు. స్వచ్ఛమైన సంకల్పంతో ఏ కులంలోని వారైనా, ఏ వృత్తివారైనా సాధన చేయవచ్చని ప్రత్యక్షంగా నిరూపించారు. ఆయన ప్రతిపాదించిన విషయాలు విప్లవాత్మకంగా పరిగణించబడ్డాయి. వారు వ్రాసిన భక్తి స్తోత్రాలు ''భైరవ స్తవం'' పేరుతో ప్రసిద్ధి గాంచాయి. అభినవగుప్తుడు ప్రతిపాదించిన శైవ సంప్రదాయం కాశ్మీరశైవం (ఖaరష్ట్రఎఱతీఱ ూష్ట్రaఱఙaఎ) పేరుతో పిలువబడుతోంది.

క్రీ.శ.1016వ సంవత్సరంలో ఒక అపూర్వ సంఘటన జరిగింది. అభినవ గుప్తుడు తన 1200 మంది శిష్యులతో గుల్‌మార్గ్‌ పర్వతశ్రేణులలోని ''బర్వా'' అను గ్రామం సమీపములోని ఒక గుహలోకి ''భైరవస్తవం'' పఠిస్తూ అదృశ్యమయ్యారు. ఇప్పటికీ ఆ గుహను ''భైరవగుహ'' పేరుతో పిలుస్తారు. వారు శివైక్యం పొంది 1000 సం||లు అయ్యింది. అభినవగుప్తుడు ప్రబోధించిన తత్త్వాలు నేటికీ చిరస్మరణీయంగా నిలిచి ఉన్నాయి.

 - పి.వి.సత్తిరాజు