ఆధ్యాత్మిక శక్తులను ఏకం చేయాలిరాజకీయాలలో నేడు వేరు వేరు వర్గాలున్నట్లే, ఆధ్యాత్మికరంగంలో కూడా వేరు వేరు శక్తులు ఉండటము ఆశ్చర్యకరమైన విషయము. ప్రాపంచిక జీవితంతో ఏ సంబంధం లేకుండా పరబ్రహ్మ నుంచి, ఆత్మ నుంచి స్ఫూర్తిపొందే విషయాలు ఆధ్యాత్మిక విషయాలు. అటువంటి ఆధ్యాత్మిక వేత్తలలో కూడా ఒకరిమీద మరొకరికి గిట్టనివారు ఉన్నారు. ఇది చాలా విచారకరమైన విషయం. చెల్లా చెదురుగా ఉన్న ధార్మికశక్తులను ఏకం చేయాలి. దేశానికి ఏమైనా మేలు చేయ దలచుకుంటే ముందుగా మనం చేయవలసినది ఇదే.

దేశభక్తిగల వారినందరిని ఒక దగ్గరకు తెచ్చి ఏకం చేసినట్లే ధార్మిక శక్తులన్నింటిని ఏకం చేయటం అసాధ్యమైన విషయం ఏమీ కాదు. వివేకానందుడు ఆ పని చేయటానికి కృషి చేశాడు. తాను తన పేరుతో ఒక క్రొత్త సంప్రదాయాన్ని ప్రారంభించాలని కోరుకోలేదు. వివేకానందుని రచనలు, ఉపన్యాసాలను చదివితే తన పేరుమీద ఒక వర్గం ఏర్పడటం ఆయనకు ఏ మాత్రం సమ్మతం కాదు. దేశంలో చెల్లాచెదురుగా ఉన్న ఆధ్యాత్మిక శక్తులన్నింటిని ఏకం చేయాలని పదే పదే చెప్పేవారు. దానికి తనదైన కార్య ప్రణాళికను సూచించారు. ఆ మార్గంలోనే మనం ముందుకు వెళ్ళాలి.

- శ్రీ ఏక్‌నాథ్‌జీ రానడే, వివేకానంద శిలా స్మారక్‌ రూపకర్త