చర్చల్లో త్రిపుల్‌ తలాఖ్‌మా మతాచారాల్లోకి ఎవ్వరి జోక్యాన్ని సహించమంటూ ఇస్లామిక్‌ సంస్థలు ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాయి. మరోవైపు ముస్లిం మహిళలు తమకు కూడా పురుషులతో సమానంగా మసీదులు, దర్గాల్లోకి ప్రవేశం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాకుండా తమ భర్తలు తలాఖ్‌... తలాఖ్‌... తలాఖ్‌ అని మూడుసార్లు చెప్పి విడాకులు ఇచ్చే విధానాన్ని రద్దుచేయాలని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఇది ఎన్నికల ముందు కామన్‌ సివిల్‌ కోడ్‌ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆడిస్తున్న నాటకమని దేశంలోని లౌకిక పార్టీలు, ముస్లిం మత పెద్దలు నెత్తినోరు బాదుకుంటున్నారు. కొందరైతే షరియా చట్టాల అమలులో ముస్లింలను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అసలు ఈ త్రిపుల్‌ తలాఖ్‌ ఏంటి? ఈ గోడవేంటి? ముస్లిం మహిళాలు దీన్ని వ్యతిరేకించడానికి గల కారణం ఏంటి? దీనిపై రాజ్యాంగం ఏమంటుంది? అనే అంశాలను చిన్నగా పరిశీలిద్దాం.

భారతీయ ముస్లిం మహిళా ఆందోళన నాయకురాలు జకియా సోమన్‌ మాటల ప్రకారం త్రిపుల్‌ తలాఖ్‌కు సంబంధించి ఖురాన్‌లో ఎటువంటి ఆధారాలు లేవని, ప్రవక్త మరణానంతరం తాత్కాలికంగా దీనిని చేర్చడం జరిగిందని, తొంభై రోజుల కాలంలో కలిసి ఉండడమా విడిపోవడమా నిర్ణయించే హక్కు ఇరువురికి ఉంటుందని అన్నారు. ఆమె మాటల ప్రకారం ఖురాన్‌లో త్రిపుల్‌ తలాఖ్‌ ప్రస్తావన లేని కారణంగా దానిని నిషేదించడం షరియాకు వ్యతిరేకం కాదు. ముస్లిం మత పెద్దలు ఈ విషయంలో రాద్దాంతం చేయడంలో అర్థం లేదని వారు వాదిస్తున్నారు. నిజానికి షరియా చట్టాల ప్రకారం భర్తకు మాత్రమే విడాకులు ఇచ్చే హక్కు ఉంటుంది. భార్యకు ఎటువంటి హక్కు ఉండదు. భార్యకు ఒకవేళ 90రోజుల కాలవ్యవధిలో భర్తకు తిరిగి ఇష్టం పుడితే ఆమెను దగ్గరికి తీసుకోవచ్చు. విడాకులు పొందిన అనంతరం భార్య కూడా మరో పురుషుడిని వివాహం చేసుకోవచ్చు.

కాని నేడు చాలమంది షరియా చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. బహు భార్యత్వాన్ని షరియా సమర్థించడం; తలాఖ్‌ అని చెప్పిన వెంటనే విడాకులు మంజూరు చేయడం ద్వారా ఎంతోమంది ముస్లిం మహిళలు అన్యాయానికి గురవుతున్నారు. నేటి భారతీయ ముస్లిం మహిళలు ఈ విధానాలను వ్యతిరే కిస్తున్నారు. షరియా చట్టంలోని త్రిపుల్‌ తలాఖ్‌ను నిషేధించాలంటూ ఉద్యమాలు చేపడుతున్నారు.

నిజానికి షరియా చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఒక దేశంలోని పౌరులకు ఒకేరకమైన చట్టం ఉండాలి. అందుకు భిన్నంగా భారతదేశంలో ప్రైవసీతో పాటు షరియా కూడా చలామణిలో ఉండడం ఒకింత బాధాకరం. ముఖ్యంగా దళిత, గిరిజనులతో పాటు స్త్రీలకు ప్రత్యేక హక్కులను కల్పించింది. ముస్లిం మహిళల కోసం ప్రత్యేక
చట్టాలను రూపొందించ వలసింది పోయి వాటిని సమర్థించేలా ముస్లిం మత పెద్దలు వ్యవహరించడం మహిళలకు అన్యాయం చేయడమే. అంతేకాకుండా దేశ లౌకిక స్ఫూర్తికి భంగం కలిగించడమే. ముఖ్యంగా తన భర్తకు నచ్చలేదనో, కోపం వచ్చిందనో, మరేదో కారణం చేతనో తలాఖ్‌ అని చెప్పి విడాకులు ఇచ్చి అన్యాయం చేయడం హేయమైన చర్యగా భావించవచ్చు.

భారత రాజ్యాంగంలోని అధికరణం 15(1) ప్రకారం లింగవివక్షను చూపొద్దు. అధికరణం 15(3) ప్రకారం ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకచట్టాలను రూపొందించ వచ్చు. రాజ్యాంగ అధికరణం 23(1) ప్రకారం మానవ అక్రమ రవాణా, బలవంతంగా కూలీ చేయించండం నేరం. రాజ్యాంగంలోని 39(ఎ) అధికరణం స్త్రీ, పురుషులకు జీవించడానికి సమాన హక్కులు కల్పించాలని సూచిస్తుంది. 39(డి) స్త్రీ, పురుషులు ఇరువురికి సమాన జీతం చెల్లించాలి. ఆర్టికల్‌51-ఎ(ఈ) ప్రకారం స్త్రీల గౌరవాన్ని కాపాడడం పౌరుల ప్రతి ఒక్కరి బాధ్యత.

త్రిపుల్‌ తలాఖ్‌ విధానాన్ని అనుసరించడం అంటే రాజ్యాంగం స్త్రీలకు ఇచ్చిన హక్కులను కాలరాయడమే. వారి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లేలా చేయడమే. వారి సమానత్వాన్ని అణగద్రొక్కడమే. సమానత్వం కావాలి అంటూ ఇన్ని రోజులు మొత్తుకున్న మహిళా సంఘాలు ఈ విషయంలో నోరు మెదపకపోవడం విచారకరం. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తూ మత రాజకీయాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ ముస్లిం మహిళల పట్ల తాము ప్రవర్తిస్తున్న తీరుకు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన తరుణమిది.