స్ఫూర్తి

తమ సాధన కాలంలో శ్రీరామకృష్ణులు ఒక రూపాయిని. ఒక మట్టి ముద్దను పుచ్చుకొని వాటిని జాగ్రత్తగా పరిశీలించి,
''ధనం.. మట్టి ముద్దే ధనం'' అని పలికారు. అలా పలికి ఆ వెంటనే రెండింటినీ గంగలో విసిరివేశారు. ఆయన యాభై ఒక్క సంవత్సరాలు జీవించి ఈ ప్రపంచంలో డబ్బు తాకకుండా జీవించ వచ్చునని రుజువు చేశారు. మథూర్‌, లక్ష్మీనా రాయణ్‌ మార్వాడీ గురుదేవులకు డబ్బు ఇవ్వ బోయారు. ఆయన డబ్బును నిరాకరించడమే కాకుండా తమను ప్రలోభపరచడానికి ప్రయత్ని స్తున్నారని వారిని గట్టిగా చీవాట్లు పెట్టారు. లౌకికులు డబ్బును ప్రేమిస్తారు. తమకు శాంత్యా నందాలను అది తెచ్చిపెడుతుందని వారు భావిస్తారు. డబ్బుతో విలాసవంతమైన భవనాలను, ఖరీదైన కార్లను, రకరకాల వస్త్రాలను, ఇతర సౌకర్యా లను కొనుగోలు చేయవచ్చు- కాని భగవంతుణ్ణి కాదు. కలకత్తావాసులకు శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు. ''వ్యాజ్యాలలో నెగ్గాలి, ఎంతో ధనం గడించాలి, ఇతరు లను న్యాయస్థానాలలో గెలిపించడానికి సహాయం చేయాలి. ఆస్తిపాస్తులు సముపార్జించాలి-వీటి కోసం సాధనలు అనుష్టించడం? నీచాతినీచం. తిండి,గుడ్డ, తలదాచుకోవడానికి ఒక ఇల్లు, భగవత్సేవకు, సాధుసేవకు, తారసపడ్డ పేదసాదలకు సహాయం చేయడానికి ధనం వినియోగపడుతుంది. ఇవి ధనం ద్వారా జరిగే సద్వినియోగాలు. ఆడంబరాలకూ, భోగాలకూ ధనం ఉపయోగించరాదు. సమాజంలో పేరు ప్రతిష్టలు సముపార్జించడానికి ధనం వినియోగించకూడదు.