తుమ్మలపల్లి హరిహరశర్మ రాష్ట్రంలో అఖిలభారతీయ విద్యార్థి పరిషత్
కార్యకలాపాలు విస్తరించడంలో ప్రధానపాత్ర వహించారు. అలాగే సమాచార భారతి,
జాగృతి మొదలైన సంస్థలకు కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ఇటీవల స్వర్గస్థులైన
వారి జీవిత విశేషాలు కొన్ని ఇక్కడ ఇస్తున్నాం.
కీర్తిశేషులు హరిహర శర్మగారు 2004 నుంచి 2016 వరకు సమాచార భారతి
అధ్యక్షులుగా ఉన్నారు. సమాచార భారతి కార్యకలాపాలు వారి అధ్యక్షతన
విజయవంతంగా జరిగాయి. లోకహితం పత్రికకు కూడా వారి మార్గదర్శనం ఉండేది.
పత్రిక ప్రారంభించిన అనతి కాలంలోనే పాఠకుల మనసు చూరగొని అనేక గ్రామలకు
పంపబడింది. అనేకమంది తమంతటతాము పత్రిక చందాదారులుగా కూడా చేరారు. సమాచార
భారతి కూడా పత్రిక రంగంలో పనిచేసే వారిలో మంచి పేరును సంపాదించగలిగింది.
గడిచిన 8సం||లకు పైగా నారద జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని పత్రికా
రంగంలో విశేష ప్రతిభ కలిగిన వారిని సన్మానించడం కూడా జరుగుతున్నది. అలాగే
స్వామీ వివేకానంద 150వ జయంతి, పండిత దీన్‌దయాళ్ శత జయంతి సందర్భంగా
పత్రిక రంగంలో వారికి విశేష కార్యక్రమం శర్మగారి అధ్యక్షతన విజయవంతంగా
జరిగింది.
హరిహరశర్మగారు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘలో ప్రవేశించిన దగ్గర నుంచి
నిరంతరంగా పని చేస్తూనేఉన్నారు. అనేకచోట్ల ప్రభుత్వ కళాశాలలో ఆంగ్ల
ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉండేవారు. సంఘ కార్యం అవసరం దృష్ట్యా ఆయన
భాగ్యనగర్ చేరుకున్నారు. భాగ్యనగరంలో విజయనగరం కాలేజి ఆఫ్ కామర్స్ అనే
కళాశాలలో ప్రిన్స్‌పాల్‌గా చేరి సుదీర్ఘకాలం పని చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో
ఏబీవీపీ ప్రారంభకులలో వీరు కూడా ఒకరు. సంఘం అప్పచెప్పిన ఆ పనిని ఆయన పూర్తి
చిత్తశుద్ధితో, నిష్టతో చేశారు. విద్యార్థి పరిషత్ ప్రాంతంలో
విస్తరించేందుకు ఎదురైన అటంకాలు అధిగమించేందుకు తగు సూచనలు చేసేవారు.
ఆంధ్రప్రదేశ్‌లో నక్సల్ కార్యకలపాలు పెరుగుతున్న సమయంలో ఏబీవీపీ
కార్యకర్తలకు, ఇతర విద్యార్థి సంఘాల వారికి మధ్య అనేక సంఘర్షణలు జరిగాయి.
అనేకమంది ఏబీవీపీ కార్యకర్తలు తమ ప్రాణాలు కోల్పోయారు కూడా. అటువంటి
క్లిష్ట పరిస్థితులలో ధైర్యంగా ముందుకు నడిపించడంలో విశేష ప్రయత్నం చేసిన
అనేక మందిలో శర్మగారు ఒకరు. వారి మార్గదర్శకత్వంలో అనేక మంది కార్యకర్తలు
తయారయ్యారు. వాళ్ళంతా ఇప్పుడు ఏబీవీపీ, ఇతర క్షేత్రాలలో పని చేస్తున్నారు.
హరిహర శర్మగారికి పత్రిక రంగానికి సంబంధించిన పని కూడా
అప్పచెప్పబడింది. హైదరాబాద్‌లో ప్రారంభమైన రచన జర్నలిజం కాలేజీకి
ప్రిన్స్‌పాల్‌గా వారు కొంతకాలం పనిచేశారు. రచన కాలేజీలో శిక్షణ పొందిన
అనేక మంది ప్రస్తుతం వివిధ పత్రికలలో పనిచేస్తున్నారు. శర్మగారు జాగృతి
ప్రకాశన్ ట్రస్టు కార్యదర్శిగా కూడా ఉన్నారు.
ఇతిహాస సంకలన సమితికి సంబంధించిన పనిని కూడా వారు చూశారు. ఇతిహస సంకలన
సమితి పత్రిక కూడా వారి ఆధ్వర్యంలో ప్రచురితమయ్యేది. దక్షిణ భారతదేశంలో
ప్రసిద్ధి చెందిన శృంగేరి పీఠంతో వారికి సన్నిహిత సంబంధాలు ఉండేవి.
2దశాబ్దాలకు పైగా ఆ పీఠానికి చెందిన 'శంకర కృప' అనే పత్రికకు సంపాదకులుగా
కూడా పని చేశారు. భాగ్యనగర్ నారాయణగూడాలో ఉన్న కేశవ మెమోరియల్
ఎడ్యుకేషనల్ ట్రస్టు కార్యదర్శిగా చివరి క్షణం వరకు కూడా వారు అందించిన
సేవలు విశేషమైనవి.
ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజీ కార్యకలాపాలు ఆయన పర్యవేక్షణలో
సాగేవి. ఆ ట్రస్టు ద్వారా విద్యారంగానికి వారు చేసిన సేవలు ఎనలేనివి. ఈ
విధంగా వివిధ కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. సంఘం చెప్పిన ప్రకారం చేయటం
ఆయన విశేషం. కుటుంబానికంటే ఎక్కువ ప్రాధాన్యత సమాజ కార్యక్రమానికి
ఇచ్చేవారు.
ఈ రోజున జరుగుతున్న సైద్దాంతిక సంఘర్షణలో అనేక సార్లు హిందుత్వానికి
సంబంధించిన విషయాలను స్పష్టంగా చెప్పేందుకు టివి ఛానల్ చర్చల్లో కూడా అనేక
సార్లు పాల్గొన్నారు. సాహిత్య నిర్మాణం కోసం పని చేసిన వారిలో శర్మగారు
ఒకరు. అనువాదం చేయడం, పుస్తకాలు రాయడం చేశారు. అనేక విషయాలపై విశేష అధ్యయనం
చేశారు.
అనేక మందికి ప్రేరణ అందించిన శ్రీహరిహర శర్మగారు 29-06-2017 ఇహలోకాన్ని
వదిలి వెల్లారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని సమాచారభారతి, లోకహితం బృందం
భగవంతున్ని ప్రార్థిస్తోంది.
శ్రద్దాంజలి
''హరిహరశర్మగారు ఇకలేరన్నది చాలా విచారక రమైన వార్త. నిష్టావంతులైన ఒక
కార్యకర్తను, పాలక్ ను మనం కోల్పోయాం. ఆయన మంచి పండితులు. అనేకమందిని
తీర్చిదిద్దినవారు. ఆయన మృతిపట్ల తీవ్ర సంతా పం వ్యక్తం చేస్తున్నాను. వారి
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. వారి ఆత్మకు
శాంతి కలగాలని కోరుకుంటున్నాను.''
- శ్రీ దత్తాత్రేయ హొసబళే, సహ సర్ కార్యవాహ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
''తండ్రిలా మార్గదర్శనం చేసే వ్యక్తిని కోల్పోయాం. కార్యకర్తలతో ప్రేమపూర్వకంగా, మానవీయ విలువలతో ఎలా వ్యవహరించాలో ఆయన నేర్పారు.''
- శ్రీ సురేంద్ర, కార్యనిర్వహణ కార్యదర్శి, భారతీయ మజ్దూర్ సంఘ్
''నిరాడంబర జీవనం, అత్యున్నతమైన ఆలోచనకు హరిహరశర్మగారు గుర్తు. ఆయనతో
అనుబంధం చాలా సుదీర్ఘమైనది'' - శ్రీ ఎల్. నరసింహా రెడ్డి, మాజీ హైకోర్ట్
న్యాయమూర్తి
''లోకహితం పత్రిక ప్రారంభం కావడంలో శ్రీశర్మగారి పాత్ర చాలా ఉంది. ఆయన
ప్రారంభిం చిన ఆ పత్రిక ఇప్పుడు 6 వేల గ్రామాల కు వెళుతోంది. ఆయన 2004
నుండి 2016 వరకూ సమాచార భారతి అధ్యక్షులుగా కూడా ఉన్నారు''
- రాంపల్లి మల్లికార్జున్, మాజీ కార్యదర్శి, సమాచార భారతి