భారతీయ సంసృతి ని భావితరానికి అందివ్వడంలో మహిళలదే కీలక పాత్ర


భారతీయ సంసృతి దృఢంగా ఉన్నపుడే మనతో పాటు ప్రపంచం సుఖ సంతోషాలతో ఉండగలుగుతుంది అని విశ్వసించి, తాను పుట్టిన దేశాన్ని (ఐర్లాండ్‌) వదిలి భారత దేశాన్ని కన్న తల్లిగా భావించి జీవితాన్ని ధారపోసిన నిస్వార్ధ మహిళ సోదరి నివేదిత. ఆమె జీవితం అందరికి స్ఫూర్తిదాయకం. స్వాతంత్రానికి పూర్వం ఉన్న ప్రతికూల పరిస్థితులను సైతం ఎదుర్కొని మహిళా చైతన్యం కొరకు విద్య, సేవ ప్రధానం అని ఆ దిశలో పని చేసిన గొప్ప దేశ భక్తురాలు నివేదిత అని ఆచార్య పి. సుమతి నాగేంద్ర అన్నారు.


సోదరి నివేదిత 150 జయంతి ఉత్సవాలలో భాగంగా 'సమాచార భారతి కల్చరల్‌ అసోసియేషన్‌' 29 అక్టోబర్‌ హైదరాబాద్‌, ఖైరతాబాద్‌లోని ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ అఫ్‌ కామెర్స్‌ అండ్‌ మానేజిమెంట్‌' ప్రాంగణంలో ''పాత్రికేయులు, రచయితలు, సోషల్‌ మీడియా ఆక్టివిస్ట్‌ల-మహిళ సమావేశం'' లో పి. సుమతి  ముఖ్య అతిధి పాల్గొని ప్రసంగించారు.

ఆమె మాట్లాడుతూ సమాజంలో నాలుగవ మూల స్థంభంగా కొనియాడే పాత్రికేయ వత్తిలో ఉన్న మహిళలది కీలక పాత్ర అని, దాన్ని సమర్ధవంతంగా పోషించి దేశానికి మార్గదర్శనం చేయడంలో ముందు ఉండాలి అని సూచించారు.

కార్యక్రమంలో మరో ముఖ్య అతిధిగా పాల్గొన్న రచయిత డాక్టర్‌ పుట్టపర్తి నాగ పద్మిని  మాట్లాడుతూ ''సంసృతిని ఒక తరం నుండి మరొక తరానికి అందించగల వారు మహిళలు అని, ఒక విదేశీయురాలు అయినా సోదరి నివేదిత స్వామి వివేకానంద బోధనల ద్వారా ప్రభావితమై హిందుత్వాన్ని స్వీకరించి భారతమాత సేవలో లీనమైన విధానం ఆదర్శనీయం. భారతీయులందరినీ సమైక్యపరిచే హిందుత్వంపై జరుగుతున్న దాడులు తిప్పి కొట్టాలని, భారతీయ దక్కోణంలో చరిత్రను రాసి దేశ ఔన్నత్యాన్ని తిరిగి సాధించాలని ఆమె అన్నారు.

ఈ సమావేశంలో జరిగిన చర్చలో మీడియా రంగంలో ఎదురవుతున్న వివిధ సమస్యలు, హిందూ సంసృతి పై జరుగుతున్న దాడి గురించి పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో వివిధ మీడియా సంస్థల్లో పని చేస్తున్న జర్నలిస్టులు మరియు మహిళా రచయితలు పాల్గొన్నారు. సమాచార భారతి కార్యదర్శి శ్రీ ఆయుష్‌ సమాచార భారతి ద్వారా జరుగుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు.  శ్రీమతి దేవిక మరియ శ్రీమతి ఆరాధన కార్యక్రమ నిర్వహణ చేసారు.