ఈ నేలంతా భారతమాత గానమే

వందల సంవత్సరాల పోరాటం తదుపరి 1947 ఆగస్టు 15న మనం మన దేశానికి స్వాతంత్య్రం సంపాదించుకున్నాము. 1950 జనవరి 26 నుంచి మనదైన రాజ్యాంగాన్ని అమలు పరుచుకున్నాం.  ఆ రోజున మన తల్లి అయినటు వంటి భారతమాతను పూజించాలి... వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మనజాతిలో సమైక్యతకు సాంస్కృతిక ఏకత్వానికి ప్రపంచానికి ఒక నమూనాగా భారత్‌ నిలబడి ప్రపంచానికి మార్గదర్శనం చెయ్యాలి, ఆ ప్రేరణ భారత మాత పూజ నుండి మనం పొందాలి.
ఉన్న ఊరు, కన్న తల్లి అనేది మన నానుడి. మనకు జన్మనిచ్చిన తల్లిలాగా మనం జన్మించిన భూమి కూడా మనకు తల్లే అంటుంది వేదం. ఎందుచేత? కన్నబిడ్డల మీద తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో మనకు తెలుసు. బిడ్డల అవసరాలు కనిపెట్టి ఎప్పుడు ఏవి కావాలో అవి అమర్చి అన్నపానాదులతో కడుపునింపి పెంచి పెద్ద చేస్తుంది. కంటికి రెప్పలా చూసుకుంటుంది. అలాగే మన మనుగడకు ఈ భూమి మూలాధారంగా అన్ని ఇస్తున్నది. అందుచేత ఈ భూమి మన మాతృ భూమి. ఇది మనకు నిజంగా కన్నతల్లే. మాతృభూమి పట్లగల శ్రద్ధాభక్తులే జాతీయ జీవనానికి ఆధారం. అందుకే అధర్వణ వేదం భూమిసూక్తంలో 'మాతా భూమిః పుత్రోహం పృధివ్యాః' అని చెప్పబడింది. అంటే ఈ భూమి నా తల్లి, నేనామె పుత్రుడను. జాతీయ సంఘటనకు  అదే మూల స్రోతస్సు. మాతాపుత్ర సంబంధం ఇచ్చి పుచ్చుకొనే సంబంధం కాదు. దానికి కారణాలు వెతికితే దొరకవు. ప్రపంచంలో తల్లిని మరిచిపోయే కొడుకులు        ఉండవచ్చు కాని కొడుకును మరిచిపోయే తల్లి ఎక్కడా ఉండదు అని చెప్పారు జగద్గురువు శంకరాచార్యులు. మన దేశం, ఎల్లలు గురించి విష్ణు పురాణంలో

ఉత్తరం యత్‌ సముద్రస్య

హిమాద్రేశ్చైవ దక్షిణమ్‌

వర్షం తత్‌ భారతం నామ

భారతీ యత్ర సంతతిః


సముద్రాలకు ఉత్తరాన, హిమాలయములకు దక్షిణాన విస్తరించి ఉన్న దేశం భారతదేశం. ఈ దేశవాసులు భారతీయులు అని వర్ణించారు. ఈ ప్రేరణతో ఈ దేశం వికసిస్తూ వచ్చింది. ఈ దేశంలో జన్మించిన అనేక మంది మహాపురుషులు తమ జీవితాలను భారతమాతకు సమర్పణ చేశారు. ఈ భూమిని కాపాడుకోవడం మన కర్తవ్యం. స్వాతంత్య్ర పోరాటం సత్యం కోసం పోరాటంగా ప్రేరణ కలిగించింది. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన మన పెద్దలకు భారత్‌ ఒక ఆధ్యాత్మిక ప్రేరణ. ఇది ఒక మంత్రంగా భావించేవారు. అందునే బంకించంద్ర 'వందేమాతరం' అన్నారు. 'ఓ తల్లి నీకు నమస్కారము' అని దాని అర్థం. భారత్‌ అనటంతోటే భౌగోళికమైన ప్రజలు, పర్వతాలు, నదులు, మొదలైనవి మాత్రమేకాక ఒక భావాత్మక ప్రేరణ.బంకించంద్ర ఇంకా 'త్వంహి దుర్గ' అని వర్ణించారు. రవీంద్రుడు 'అయిభువన మన మోహిని' అని వర్ణించారు. అరవిందులు ఈ భూమిని సాక్షాత్‌ జగన్మాతగా వర్ణించారు. ఈ భూమి సంరక్షణ కొరకు రాణా ప్రతాప్‌, ఛత్రపతి శివాజీ, గురుతేగ్‌ బహదూర్‌, గురుగోవింద్‌, ఝాన్సి లక్ష్మిబాయి, నానాసాహెబ్‌ పీష్వా, మహారాజ్‌ ఛత్రసాల్‌, వంటి యోధులు పోరాటం చేశారు. ఆంగ్లేయులపై జరిగిన పోరాటంలో అనేక మంది తమ జీవితాలను త్యాగం చేశారు. ఆ సమయంలో ''భారత్‌ మాతాకీ జయ్‌'' అనే నినాదం కోట్లాది ప్రజలకు ప్రేరణ నిచ్చింది. వందేమాతర గీతం ఈ దేశమంతా ప్రతిధ్వనించింది. ఈ రోజున మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారా నికి అదే ప్రేరణ. అనేక భాషలు, మతాలు ఉన్నప్పటికీ భారత్‌మాతాకీ జయ్‌ అనే నినాదమే మన అందరినీ ఐక్యం చేస్తుంది. తల్లి, తండ్రి, గురువు ఈ మూడు రూపాలు ఒకే ఆకృతి దాల్చి వచ్చిన దివ్యమూర్తి మన మాతృభూమి. ఆ మాతకు మన జీవితాలను సమర్పణ చేయాలనే భావన మన అందరి హృదయాలలో జాగృతం కావాలి.

వందల సంవత్సరాల పోరాటం తరువాత 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం సంపాదించుకున్నాము. 1950 జనవరి 26 నుంచి మనదైన రాజ్యాంగాన్ని అమలు పరుచుకున్నాం. స్వాతంత్య్రం సంపాదించుకుని 68 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ రోజున దేశంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఏ ప్రేరణ దేశ స్వాతంత్య్ర పోరాటానికి పురికొల్పిందో ఆ ప్రేరణ ఈ రోజున నాయకత్వంలో నేడు కనబడటం లేదు. దేశభక్తి అనేది ఒక మూఢనమ్మకంగా భావిస్తున్నారు ఈ రోజుల్లో. ఇది ఇంకా ఎక్కువ కాలం కొనసాగడం ప్రమాదకరం. ఈ దేశం సమస్యలు పరిష్కరించు కునేందుకు మనమందరం ముందుకురావాలి. అటువంటి ఆలోచనలతో దేశమంతటా జాగృతం కావాలి. దానికి ప్రేరణ'భారత్‌ మాతాకి జయ్‌' అనే నినాదం.

ఇంట్లో తల్లిదండ్రులను, బళ్లో ఉపాధ్యాయు లను, ఊళ్లో పెద్దలను దేశంలో నాయకులను ప్రమాణంగా తీసుకొని మిగతావారు నడుస్తారు. కనుక ఒరవడి సరిగా ఉండాలి. సత్‌ప్రవర్తన, ధర్మపరాయణత్వం, శూరత్వం, కార్యనిర్వహణ సామర్థ్యం, కర్తవ్య నిష్ట, జ్ఞానం, యజ్ఞం ఇటువంటి శ్రేష్టగుణాలే దేశాన్ని అభ్యుదయ మార్గంలో నడిపిస్తాయి. వ్యక్తిపూజ పెరిగితే కల్లాకపటాలతో జనాన్ని మభ్యపెట్టి ప్రజలను దురలవాట్లకు బానిసలను చేస్తారు. స్వార్థపరాయణులై సర్వం స్వాహాచేస్తుంటారు. దీన్ని నివారించేందుకు పరంపరాగతంగా వస్తున్న విలువలను కాపాడు కోవడం మన అందరి కర్తవ్యం. అందుకే మన మాతృభూమిని ఆరాధిద్దాం.

భారతమాతకు ముద్దబిడ్డలం

హిందువులం ప్రియబంధువులం

దేశధర్మముల ప్రగతి కోసమై

జీవించుటయే మన గమ్యం

సాధించుటయే మన లక్ష్యం


అనే విషయాన్ని గుర్తుచేసుకుందాం. అందుకే జనవరి 26న ఈ సమున్నత లక్ష్యం సాధించేందుకు భారతమాత పూజ కార్యక్రమం నిర్వహిద్దాం. దానిలో పాల్గొందాం. ఈ దేశంలో మనమందరం సహోదరులం అనే భావన జాగృతం చేద్దాం. అప్పుడు దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. 'భారత్‌ మాతాకీ జయ్‌' అనే నినాదం ఈ దేశంలో మారుమ్రోగిద్దాం.