సంఘకార్యంపట్ల విశ్వాసం పెరుగుతోంది


దేశం మొత్తం నుండి ఎన్నికైన ప్రతినిధులతో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ అఖిలభారతీయ ప్రతినిధి సభ సమావేశాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. వీటిలో దేశం మొత్తంలో సంఘ కార్యం, వివిధ క్షేత్రాలకు సంబంధించిన పని గురించి సమీక్ష జరుగుతుంది. అలాగే దేశానికి సంబంధించిన ప్రధాన అంశాలపై చర్చ, తీర్మానాలు ఆమోదించడం జరుగుతుంది.  ఈ సంవత్సరం ఈ సమావేశాలు నాగపూర్‌లో జరిగాయి.  మా.సర్‌ కార్యవాహ్‌ సురేశ్‌ జోషిజీ వార్షిక నివేదిక సమర్పించారు. ఆ నివేదిక సారాంశం -

శ్రద్ధాంజలి

మన తోటి కార్యకర్తలను, స్నేహితులను, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కోల్పోవడం బాధను కలిగిస్తుంది. కానీ కాలగతిలో అటువంటి మహానుభావులు మనను వదలి పరమపదాన్ని చేరుకున్నారు.

అలాగే దేశ రక్షణ కార్యంలో, తీవ్రవాదులతో పోరాడుతూ చాలామంది సాహసవంతులు, వీరులు తమ ప్రాణాలు త్యాగం చేశారు. కానీ దురదృష్టవ శాత్తు మన సోదరులు కొందరు రాజకీయ హింసకు బలికావడం విచారించదగిన విషయం. అలాగే కొందరు ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల మూలంగా ప్రాణాలు కోల్పోయారు. అలా స్వర్గస్తులైన వారందరికి అఖిలభారతీయ ప్రతినిధి సభ శ్రద్ధాంజలి ఘటిస్తోంది. వారి ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్ధిస్తోంది.

సర్‌ సంఘచాలక్‌ జీ పర్యటన


పరమ పూజనీయ సర్‌ సంఘచాలక్‌ జీ కార్యకర్తలతో సమావేశాలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలిశారు. అలాగే వివిధ ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ప.పూ.సర్‌ సంఘచాలక్‌ జీ రామకృష్ణ మఠ అధ్యక్షులు స్వామి స్మరణానంద్‌ జీ, బోరా సమూహానికి చెందిన స్వేదన సాహెబ్‌, ఈశా ఫౌండేషన్‌ సద్గురు జగ్గి వాసుదేవ్‌ జీ, హాన్స్‌ ఫౌండేషన్‌ కు చెందిన పూజ్య భోలే జీ మహారాజ్‌, పూజ్య మంగళ మతాజీ, మహామహీమ్‌ రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కొవింద్‌ జీ మొదలైనవారిని కలిశారు.

శాఖల వివరాలు

సం.    ప్రదేశాలు    శాఖలు     మిలన్‌     మండలి

2017    36729    57165    14986    7594

2018    37190     58967     16405    7976 


ప్రచార విభాగం

ప్రతి సంవత్సరం మాదిరిగానే 2017లో కూడా వివిధ ప్రాంతాలలో 'నారద జయంతి' కార్యక్రమాలు జరిగాయి. వీటిలో మొత్తం 40,000 మంది పాల్గొన్నారు. వారిలో 10,000 మంది జర్నలిస్ట్‌లు. పత్రికా రంగంలో విశేష సేవలను అందించిన 1300 మందిని సన్మానించడం జరిగింది.

వెబ్‌ సైట్‌ ద్వారా జాయిన్‌ ఆర్‌ ఎస్‌ ఎస్‌ ప్రయత్నం. ప్రజానీకం సంఘ కార్యంలో తమంత తాము భాగస్వాములు కావడానికి వీలుగా షషష.తీరర.శీతీస్త్ర వెబ్‌ సైట్‌లో కొన్ని ప్రత్యేక అంశాలు జోడించారు. గత సంవత్సరం దీని ద్వారా 1.25 లక్షల మంది సంఘలో చేరడానికి తమ ఆసక్తిని తెలియజేశారు.

 జాగరణ పత్రిక మారుమూల గ్రామాలకు కూడా వెళుతోంది. 12 భాషలలొ అలాంటి 30 పత్రికలు(తెలుగులో లోకహితం) 2 లక్షలకంటే ఎక్కువ గ్రామాలకు చేరుతున్నాయి.

 జర్నలిస్ట్‌ లకు ఆర్‌ ఎస్‌ ఎస్‌ ను పరిచయం చేయడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సమావేశాలలో 7 ప్రాంతాల నుండి 541 మంది పాల్గొన్నారు.

 సంపర్క విభాగం - గత రెండు  సంవత్స రాలుగా దేశంలోని కొన్ని ప్రముఖ కేంద్రాలలో ప.పూ. సర్‌ సంఘచాలక్‌ జీ విజయదశమి ఉపన్యాసం గురించి సమాజంలోని ప్రముఖులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈసారి కూడా 18 ప్రదేశాలలో జరిగిన కార్యకారమాలలో 1007మంది ప్రముఖులు పాల్గొని ఉపన్యాసంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. డిల్లీలో జరిగిన ఇలాంటి కార్యక్రమంలో ప.పూ. సర్‌ సంఘచాలక్‌ స్వయంగా పాల్గొన్నారు. ఇతర ప్రదేశాలలో అఖిలభారతీయ అధికారులు పాల్గొన్నారు.

ప్రత్యేక కార్యక్రమాలు

మీరట్‌ : 'రాష్ట్రోదయ స్వయంసేవక్‌ సంగమం' అద్భుతంగా జరిగింది. అన్ని మండలాలు(987), అన్ని బస్తీల(1553) నుండి వచ్చిన  1,45,322 మంది స్వయంసేవకులు ఈ బృహత్‌ సభలో పాల్గొన్నారు. వీరిలో 1,01,712 మంది యువకులు (40 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ) ఉన్నారు. అన్నీ మండలాలో సంఘ కార్యాన్ని విస్తరింప చేయాలన్న ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. అందుకు కొన్ని సంవత్సరాలుగా పని జరిగింది. ఆ పని ఫలితంగానే కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వయంసేవకుల కోసం 3జిల్లాలకు చెందిన  3 లక్షల ఇళ్ల నుండి 6 లక్షల ఆహార పొట్లాలు సేకరించడం జరిగింది.

ఉత్తర అస్సాం : 'లుతిపరియ హిందూ సమావేశం' - జనవరి 21, 2018 గౌహతీలో ఉత్తర అస్సాంకు చెందిన స్వయంసేవకుల భారీ సమ్మేళనం జరిగింది. ఇందులో 239 బ్లాక్‌ (96%), 46 నగర్‌లు, 1511 కేంద్రాలు (70%), 90% నగర బస్తీలకు చెందిన మొత్తం 31,351మంది స్వయంసేవకులు పాల్గొన్నారు. అంతేకాదు ఈ సమ్మేళనంలో 35,000 మంది సాధారణ ప్రజానీకం కూడా పాల్గొన్నారు.

ఢిల్లీ : కార్య విస్తరణ : ఢిల్లీ ప్రాంతంలో ప్రత్యేక కార్య విస్తరణ ప్రయత్నం వల్ల 508 (28.5% పెంపు) కొత్త శాఖలు ప్రారంభ మయ్యాయి. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రతి శాఖ వార్షికోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. 92శాతం శాఖల్లో వార్షికోత్సవ కార్యక్రమాలు (శాఖలో నేర్చుకునే విషయాల ప్రదర్శన) జరిగాయి.

హరియాణ : సమగ్ర గ్రామీణాభివృద్ధి పధకంలో భాగంగా 'సేంద్రీయ వ్యవసాయం' పై ఒక కార్యశాల (వర్క్‌ షాప్‌) జరిగింది. ఇందులో 1,200 మంది రైతులు పాల్గొన్నారు.

దేశ పరిస్థితి

సంఘ కార్యం పట్ల ప్రజానీకంలో పెరుగుతున్న విశ్వాసంతో పాటు సంఘం నుండి వారు ఆశించే విషయాలు కూడా పెరుగుతున్నాయని గుర్తించాము. వివిధ ప్రాంతాలలో జరిగిన కార్యక్రమాలలో హిందూ సమాజం మొత్తం నుండి పెద్ద సంఖ్యలో ప్రజానీకం హాజరుకావడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో, ముఖ్యంగా త్రిపురలో, జరిగిన హిందూ సమ్మేళనాలు ఎంతో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని కలిగించాయి.

సామాజిక, మత, పారిశ్రామిక మొదలైన వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ప్రశంసలు సంఘ కార్యానికి లభిస్తున్న సర్వసమ్మతిని తెలియ జేస్తున్నాయి.

మరోవైపు సమాజంలో కనిపిస్తున్న  అంతర్గత విభేదాలు, కలతలు ఆందోళన కలిగిస్తున్నాయి.

దేశపు న్యాయ, రక్షణ వ్యవస్థల పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసం, గౌరవాలకు భంగం వాటిల్లకూడదని భావిస్తున్నాము. రాజ్యాంగబద్దంగా, న్యాయవ్యవస్థకు లోబడి ఎవరైనా తమ అభిప్రాయాన్ని వెల్లడించ వచ్చును. కానీ వీటిని అతిక్రమించకుండా ఉండడం చాలా అవసరం.