హిందూతనం, హిందూత్వం ఒకటికావా?


ఈ మధ్యకాలంలో బాగా చర్చకు వస్తున్న అంశం, పదం ఏదైనా ఉందంటే అది హిందూత్వం. హిందూత్వాన్నే హిందూతనం అని కూడా అనుకోవచ్చును. బ్రిటిష్‌ వారి నుండి ఈ హిందూత్వం అనే మాట వాడుకలోకి వచ్చింది. కనుక హిందూత్వం, హిందూతనం అనే రెండు పదాలు సమానార్ధాకాలు. అయితే వాటి వాడుకలో తేడా ఉంది.

హిందూతనం అంటే హిందూస్తాన్‌లో నివసించే ప్రజల అస్తిత్వం లేదా గుర్తింపు. రాబర్ట్‌ క్లైవ్‌, వారన్‌ హేస్టింగ్‌ లు ఈ దేశానికి వచ్చేవరకు ఈ గుర్తింపు చెక్కుచెదరలేదు. ఇక్కడి ప్రజల సమీకృత జీవన విధానం కొన్ని వేల సంవత్సరాల నుండి వస్తున్నది. ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన సముద్రాల వరకు ఉన్న భూభాగంలో ఈ జీవన విధానం వెల్లివిరిసింది. వేదాలు ఇక్కడి ప్రజల జనజీవితాన్ని, ఆలోచనలను, లోకాన్ని అర్ధంచేసుకునే తీరును రూపుదిద్దాయి. ఇక్కడి ఋషులు తాము దర్శించిన సత్యాలను ప్రజలకు తెలియచెప్పారు. అవి శాశ్వతమైనవి, చిరంతన మైనవి, వైశ్వికమైనవి. అలా శాశ్వత సత్యాల ఆధారంగా రూపొందిన జీవనవిధానం తరత రాలుగా ఇక్కడ విలసిల్లింది. భౌతిక, పారలౌకిక విషయాలన్నిటితో కూడిన ఈ జీవనవిధానానికి ఆ ధర్మం ఆధారమైంది. ఆ ధర్మమే కాలంతో సంబంధంలేని శాశ్వతమైన విలువలను, వ్యవస్థను అందించింది.

ఆ విలువలలో కొన్ని

-    పవిత్రమైన ఆలోచనలు ఎక్కడ ఉన్నా స్వీకరించడం

-    సత్యం ఒక్కటే అయినా తమతమ ఆంతరిక (లోపలి) వెలుగును బట్టి వేరువేరుగా గ్రహిస్తూ ఉంటారు

-    ఆకాశంలో పక్షులు ఎగిరే మార్గాలు, సముద్రం లో చేపలు ఈదే దారులు అపరిమితమైనట్లు గానే బుద్దిమంతుల మార్గాలు కూడా అనంతం.

-    ఈ భూమి అందరిదీ. దీనిపై ఉన్న అందరినీ ఆ భూమి భరిస్తోంది, పోషిస్తోంది

-    సృష్టి మొత్తంలో శక్తి ఒకటే. దాని స్థాయిలే మారుతాయి.

-    భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించగలగడమే నిజమైన జ్ఞానం

-    తన భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలన్నా, నాశనం చేసుకోవాలన్నా మనిషి చేతిలోనే ఉంది.

ఈ విలువలన్నీ మంత్రాల రూపంలో ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే ఇవి ఏ మతాన్ని, ఆరాధనాపద్దతిని చెప్పడం లేదు. వీటిలో అంధవిశ్వాసం, మూఢత్వం కూడా లేవు.

ఈ విలువల ద్వారానే ఇక్కడ ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఏర్పడింది. అది ప్రజల నిత్యజీవన వ్యవహారంలో ఎప్పుడూ వ్యక్తమవుతూ ఉంటుంది. అది భగవంతుడు, మానవుడి మధ్య సంబంధాన్ని చెప్పినప్పుడు మతంగా మారింది. ఇవన్నీ కలిపితే జాతీయ జీవనం, అస్తిత్వం అయింది. దీనినే హిందూతనం అంటున్నారు.

మరోవైపు హిందూతనాన్నే మతవిశ్వాసాల విషయంలో హిందూత్వంగా చెప్పవచ్చు. ప్రతి మనిషిలో ఆధ్యాత్మిక అన్వేషణాసక్తి ఉంటుంది. ఆ దిశలో హిందూతనం వెళితే అదే హిందూత్వంగా ప్రకటితమవుతుంది. నిజానికి వేదాలు ఏ ఒక్క నిర్ధారిత పూజా పద్దతిని చెప్పలేదు. మహామంత్ర రాజంగా పేరుపొందిన గాయత్రీమంత్రం కూడా సంపూర్ణ జ్ఞానాన్ని పొందే విధంగా బుద్ధిని ప్రేరేపించు అని జీవకోటికి ఆధారమైన పరాశక్తిని కోరుతూ చేసే ప్రార్ధన మాత్రమే. ఇందులో ఏ ప్రత్యేక దేవతను స్తుతించం. ఏ మతానికి చెందిన వాడైనా, ఆఖరుకు నాస్తికుడు కూడా ఈ ప్రార్ధన చేయవచ్చును. వేదాల్లో ఇలాంటివి వేలాది మంత్రాలు ఉన్నాయి. కానీ కాలక్రమేణా ఆచారాలు, పద్దతులు రూపొందాయి. వాటిని సూచించే బ్రాహ్మణాలు వచ్చాయి. హిందూతనం మత విశ్వాసాల రూపంలో ఆచారాలు, పండుగలు పబ్బాలుగా రూపుదిద్దుకుంది. అదే నేడు మనం చూస్తున్న హిందూత్వంగా మారింది.

పాశ్చాత్య సామ్రాజ్యవాదులు ఈ గడ్డపై మొట్టమొదటసారి అడుగుపెట్టినప్పుడు వారికి ఈ హిందుత్వమే ఇక్కడ  కనిపించింది. నిజానికి ఈ దేశంలో అప్పటివరకూ ఎవరు మతపరంగా తాము వైష్ణవులు, శైవులు, శాక్తేయులు మొదలైనవారమనే చెప్పుకునేవారు తప్ప 'హిందువులమని' చెప్పుకోలేదు. దీనినిబట్టి  హిందూత్వం అనే పదం సరైనదికాదని తెలుస్తుంది. ఒకవేళ  హిందూ అనే పదమే కావాలనుకుంటే అప్పుడు హిందూ మతాలు అని వాడాలి. అంటే 'సప్తర్షులు' అనే కూటమి వంటిదే ఇది. శాస్త్రీయంగా కచ్చితమైన పదమంటే మాత్రం 'ధార్మిక సంప్రదాయం' అనే వాడాలి. ఏదిఏమైనా 'హిందూత్వం' అనే పదం ప్రజల్లో, ముఖ్యంగా పాశ్చాత్యుల నిఘంటువుల్లో స్థిరపడిపోయింది. కాబట్టి తప్పైన, ఒప్పైన అదే ఉపయోగిస్తున్నారు.

హిందూత్వం ఇప్పుడు అనుకుంటున్నట్లుగా హిందూతనం కాదు. హిందూతనం అంటే ఈ దేశం, ప్రజల అస్తిత్వం. వేదకాలం నుంచి హిందూ తనం సర్వవ్యాపకమైనది. హిందూత్వాన్ని గురించి కొంతవరకే అలా చెప్పగలం.ప్రతి హిందూ మతం తన ప్రత్యేకతను చాటుకునేందుకే ప్రయత్నిస్తుంది. అయితే అవన్నీ హిందూతనం అనే శాశ్వత, వైశ్విక విలువలను పాటిస్తాయి, అనుసరిస్తాయి. (సెమెటిక్‌ మతాలు ఈ విలువలను అనుసరించవు)

ఏ జాతికి చెందిన వాడైన తన మతాన్ని ఎంచుకునే స్వేచ్చ అతనికి ఉంటుంది. కనుక ప్రపంచంలో ఏ మూలాన ఉన్నా హిందూత్వాన్ని స్వీకరించడం ద్వారా ఎవరైనా హిందువు కావచ్చును. అలాగే ఈ దేశంలో బయటనుండి ప్రవేశించిన ఇస్లాం, క్రైస్తవం హిందుత్వ ప్రభావానికి లోనైనంత మేరకు వేరుగానే ఉంటాయి. జాగ్రత్తగా గమనిస్తే ఆ విషయం మనకి స్పష్టమవుతుంది. భారతదేశంలో ఇస్లాం కొంతవరకు విగ్రహారాధనకు అలవాటుపడిందనే చెప్పాలి. చిహ్నాలను పూజించడం, కట్టడాలను నిర్మించుకోవడం దర్గాల్లో బాగా కనిపిస్తుంది. హిందూ దేవాలయాల్లో మాదిరిగా కేరళలో ముస్లిములు అనేక పండుగలు, పబ్బలు జరుపుకుంటారు. వాటికి ఉర్స్‌, చందనక్కుడమ్‌ అని ప్రత్యేకమైన పేర్లు పెట్టుకున్నారు. ఆ ఉత్సవాల్లో చక్కగా అలంకరించిన ఏనుగులు తప్పనిసరి. 

శబరిమలకు వెళ్ళే దారిలో ఉన్న ఒక మసీదులో భక్తులకు ప్రసాదంగా భస్మం ఇస్తారు. ఇక క్రైస్తవానికి వస్తే అక్కడ ఎన్ని హిందూ పండుగలు, పద్దతులు కనిపిస్తాయంటే అది హిందూత్వంలో మరొక పంథా అనిపిస్తుంది. చర్చిపై జండా, సంగీతం, మతపరమైన భాష మొదలైనవన్నీ హిందూత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. రెండు సెమెటిక్‌ మతాలు హిందూస్థాన్‌ లోని హిందూతనం వల్ల ప్రభావిత మయ్యాయి. వివాదాలకు, విమర్శలకు భయపడ కుండా భారతీయ క్రైస్తవం, భారతీయ ఇస్లాం పై హిందూతనం ప్రభావం బలంగా ఉందని చెప్పవచ్చును. అంటే దీనర్ధం ఈ మతాలు తమ మౌలిక సిద్ధాంతాలను, తత్వాన్ని మార్చుకున్నాయని కాదు.

క్లుప్తంగా చెప్పాలంటే హిందూతనం, హిందూత్వం ఒక్కటి కావు. చెప్పదలుచుకుంటే అవి కవలలు అని మాత్రం అనవచ్చు. అందువల్లనే జాగ్రత్తగా పరిశీలించనివారు, విశ్లేషించనివారు అవి రెండు ఒకటేనని పొరబడతారు. కానీ నిజమైన సాధకుడు, అన్వేషకుడు అలా పొరబడడు.

- రంగా హరి, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ పూర్వ అఖిల భారతీయ బౌద్ధిక్‌ ప్రముఖ్‌