About Us

భారతీయ ఆత్మకు 
ఈ లోకహితం దర్పణం కావాలి     

వార్తలు సత్యాన్ని మధురంగా చెప్పాలి. మధురంగా ఉన్నాయని అసత్యాన్ని చెప్పకూడదు. ఇది మన పూర్వీకులు చెప్పిన మాట. అది ప్రజా సంక్షేమాన్ని, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చెప్పిన మాట. కానీ నేటి ప్రజా బాహుళ్య మాధ్యమాలు (మాస్ మీడియా) అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రిస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు సమాజ హితకరమైన వార్తలను అందించే ప్రయత్నమిది.

వార్తలతో పాటు వార్తలపై కూడా నిష్పక్షపాత ధోరణితోనే కొనసాగాలి. కానీ ప్రస్తుతం అలా జరగటం లేదు. ప్రతి పత్రికా రచయితకు వృత్తిలో చేరకమునుపే కళ్ళజోళ్ళు వస్తున్నాయి. అవి చాలాసార్లు యెర్ర కళ్ళజోళ్ళు అవుతున్నాయి. లేకపోతె 'మావి యెర్ర కళ్ళజోళ్ళు' అని సంబరపడుతున్నారో? ఇప్పుడు సెక్యులర్ కళ్ళజోళ్ళు ఫ్యాషన్ గా పరిగణింపబడుతున్నాయి. అందువలన వార్తల వాస్తవ రూపం విలేఖరులకు, సంపదక వర్గానికి స్పష్టంగా కనపడటం లేదు. దానితో వార్తా వ్యాఖ్యానం వక్రంగా మారుతోంది. చాలాసార్లు వక్రీకరించబడిన వార్తా వ్యాఖ్యానమే వార్తగా మారుతోంది.

ఈ మధ్యకాలంలో మరో వింత మనస్తత్వం సంపాదక వర్గంలో ద్యోతకమవుతోంది. రాజకీయ పక్షాలు వోట్ల రాజకీయాలలో భాగంగా హిందూ ధర్మ వ్యతిరేక భావాలను ప్రచారం చేస్తున్నాయి. హిందూ ధర్మం గురించి చెప్పటం మతతత్వమవుతోంది. ఈ విపరీత ధోరణి మనం గ్రహించాలి. అప్పుడు కానీ లోకహితం జరుగదు.  

మనోవాక్కాయాల ద్వారా లోకహితాన్ని మన సమాజం పూర్వం నుంచి కోరుతూనే ఉన్నది. అది మన ఋషి సంప్రదాయం. 'ఆనోభాద్రా క్రతవో యన్తు విశ్వతః' (నలుదిశల నుండి వచ్చు సద్భావములను స్వీకరింతుము గాక') అని చెప్తూనే, మళ్ళీ గుడ్డిగా దేనినీ అనుకరించని భారతీయాత్మకు ఈ 'లోకహితం' దర్పణం కావాలని ఆశిస్తున్నాను.


టి.హరిహర శర్మ
ప్రింటర్ & పబ్లిషర్